సార్వత్రిక సమ్మెకు సన్నద్ధం కావాలి

21 Jul, 2016 21:27 IST|Sakshi
  • కార్మిక సంఘాల నాయకులు పిలుపు
  • ఒంగోలు టౌన్‌ :
    కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 2వ తేదీ నిర్వహించనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు ఉద్యోగ, కార్మిక వర్గం సన్నద్ధం కావాలని జిల్లాకు చెందిన కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ కనీస వేతనాన్ని 18 వేల రూపాయలకు తగ్గకుండా నిర్ణయించాలని, నిత్యవసర సరుకుల ధరలు నియంత్రించాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్టు ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులను రెగ్యులర్‌ చేయాలని కోరారు. అసంఘటిత కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని, ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్‌పరం చేసే ప్రయత్నాలను విరమించుకోవాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు భిన్నంగా ప్రజలపై భారాలు మోపుతున్నాయని విమర్శించారు. మరోవైపు ఉద్యోగులు, కార్మికుల హక్కులను హరించే విధంగా కార్మిక చట్టాల్లో మార్పులు చేస్తున్నారన్నారు. సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయడం ద్వారా ప్రస్తుత ప్రభుత్వాలకు హెచ్చరిక పంపాలని, అందుకోసం జిల్లాలోని ఉద్యోగ, కార్మికవర్గం కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్‌ మజుందార్, చీకటి శ్రీనివాసరావు, నగర కార్యదర్శి బి.వెంకట్రావు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పీవీఆర్‌ చౌదరి, నగర కార్యదర్శి కొత్తకోట వెంకటేశ్వర్లు, ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి ఆర్‌.మోహన్, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.రామస్వామి, కె.వీరాస్వామిరెడ్డి, జిల్లా నాయకులు చంద్రశేఖర్, జనార్దన్, వాసు, రఫీ పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు