నేడు సార్వత్రిక సమ్మె

1 Sep, 2016 19:43 IST|Sakshi
నేడు సార్వత్రిక సమ్మె
 • బీఎంఎస్‌ మినహా జాతీయ కార్మిక సంఘాల పిలుపు
 • ఉద్యోగ, ఉపాధ్యాయ, వామపక్ష, ప్రజా, కార్మిక సంఘాల మద్దతు
 • కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం 
 • కరీంనగర్‌ :  ఉద్యోగులు, కార్మికుల సమస్యల పరిష్కారంపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణికి వ్యతిరేకంగా దేశంలోని ప్రధాన కార్మిక సంఘాలు, వివిధ రంగాల్లోని ఉద్యోగ సంఘాలు, ఫెడరేషన్లు 12 డిమాండ్లతో శుక్రవారం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సిద్ధమయ్యాయి. ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, హెచ్‌ఎంఎస్, సీఐటీయూ, ఏఐయూటీయూసీ, ఐఎఫ్‌టీయూ, టీఆర్‌ఎస్‌కేవీ, టీఎన్‌టీయూసీ, ఐఎఫ్‌టీయూ(జే), బ్యాంకు, ఇన్సూరెన్స్, రైల్వే, రక్షణ, కేంద్ర, రాష్ట్ర ఉద్యోగ సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఎన్‌డీఏ ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించడంలో విఫలమైందని, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు మూడో వంతుకు పడిపోయినా దేశీయంగా ధరలు తగ్గించడం లేదని, ప్రజలపై పన్నుల భారాన్ని మోపుతోందని సమ్మె సైరన్‌ మోగించాయి. ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా కార్మికులు, ఉద్యోగులు, ప్రజల సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేస్తోందని మండిపడుతున్నాయి. కేంద్రప్రభుత్వం కార్మిక చట్టాల సవరణకు పూనుకోవడంతో బీజేపీ అనుబంధ విభాగమైన బీఎంఎస్‌ మినహా అన్ని కార్మిక సంఘాలు సమ్మెకు సై అనడం విశేషం. సమ్మెకు సంబంధించి గత నెలరోజులుగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ప్రజాసంఘాలు, వామపక్ష పార్టీల నాయకులు, ఆర్టీసీ, ఎల్‌ఐసీ, తదితర సంఘాల నేతలు విస్త­ృతంగా ప్రచారం నిర్వహించారు. 
   
  డిమాండ్లు ఇవే... 
  –నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలి. 
  –ప్రభుత్వ రంగ పరిశ్రమలు, సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణను నిలిపివేయాలి. 
  –నిరుద్యోగ నిర్మూలన, ఉపాధి కల్పనకు ఉపకరించే ప్రాజెక్టులను, పరిశ్రమలను నెలకొల్పాలి.
  –వివిధ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను నియంత్రించాలి. 
  –కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ విధానాలను రద్దు చేయాలి. కనీస వేతనాన్ని రూ.18 వేలకు పెంచాలి. 
  –అసంఘటిత రంగంలోని కార్మికులందరికీ సామాజిక భద్రత కల్పించాలి. ఇందుకోసం ఆయా పరిశ్రమలు తమ ఆదాయంలో 3 శాతం వాటాను కేటాయించాలి.
  –అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలను రెగ్యులరైజ్‌ చేయాలి. కార్మికులందరికీ పీఎఫ్, ఈఎస్‌ఐ, బోనస్, గ్రాట్యుటీ సదుపాయాలను వర్తింపజేయాలి.
  –కార్మిక సంఘం నమోదు కొరకు అభ్యర్థనను సమర్పించిన 45 రోజులలోగా రిజిస్ట్రేషన్‌ పూర్తి చేయాలి. సంఘం ఉనికిని యాజమానులు, అధికారులు గుర్తించాలి.
  –2013 భూస్వాధీన చట్టంలోని సామాజికSప్రభావంపై అంచనా, తగు నష్టపరిహారం చెల్లించటం, పునరావాసం కలిగించడం, ప్రజల మధ్య విచారణ జరపటం, 70 శాతం మంది ప్రజల ఆమోదాన్ని పొందటం అనే నిబంధలను తొలగించే ప్రయత్నాలను విరమించుకోవాలి.
   
  హక్కులను హరించడమే
  –ఎరవెల్లి ముత్యంరావు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి
  కేంద్ర ప్రభుత్వం కార్మిక లోకం పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాసేందుకు ప్రయత్నిస్తోంది. సంపన్న వర్గాలకు కొమ్ముకాస్తూ పేద ప్రజల నడ్డివిరిచే చర్యలకు పూనుకుంటోంది. ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయాల్సింది పోయి, ప్రైవేటీకరణకు పెద్దపీట వేస్తోంది. కనీస వేతనాలు, ఉద్యోగభద్రత, పీఎఫ్, ఈఎస్‌ఐ,గ్రాట్యుటీ, బోనస్‌ అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తోంది. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక లోకం సంఘటితంగా సమ్మెలో పాల్గొని ప్రభుత్వానికి కన్నువిప్పు కలిగించాలి. 
   
  జయప్రదం చేయండి
  –కాల్వ నర్సయ్యయాదవ్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు
  దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో అన్ని వర్గాల ప్రజలు, కార్మికలోకం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలి. హమాలీ, ట్రాన్స్‌పోర్టు, భవన నిర్మాణ కార్మికులు, బీడీ కార్మికులు, గ్రానైట్‌ కార్మికులు, షాపింగ్‌ మాల్స్‌లో పనిచేసే అసంఘటిత  కార్మికులు, స్థానిక సంస్థల్లో పనిచేస్తున్న మున్సిపల్, గ్రామపంచాయతీ, కేంద్ర, రాష్ట్ర ఉద్యోగ సంఘాలు, సామాన్య ప్రజానీకం సమ్మెలో పాల్గొని ఎన్‌డీఏ ప్రభుత్వంపై వ్యతిరేకతను చాటి చెప్పాలి. 
   
  అందరూ సహకరించాలి  
  సార్వత్రిక సమ్మెలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరుతూ గురువారం టవర్‌సర్కిల్‌లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో డప్పుచాటింపు నిర్వహించారు. నాయకులు పైడిపల్లి రాజు, కటికిరెడ్డి లచ్చన్నయాదవ్, విష్ణు, రమేశ్, ప్రభాకర్, నాగరాజు, కోంరయ్య, సాయిలు, రవి, చంద్రయ్య, మల్లేశం, వెంకటి, నారాయణ, రాజయ్య, శంకర్, భూమయ్య, నాయక్‌ పాల్గొన్నారు. సమ్మెను జయప్రదం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి ఆధ్వర్యంలో టవర్‌సర్కిల్, గంజ్, గాంధీరోడ్‌లలో దుకాణాల వ్యాపారులతో ప్రచారం నిర్వహించారు. నాయకులు రమణారెడ్డి, ఎడ్లరమేశ్, మల్లారెడ్డి, అజయ్, సంతోష్, సదానందం, రవీందర్, రాజు పాల్గొన్నారు. 
   
   
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు