రియల్‌ మాయాజాలం

30 Jul, 2016 00:41 IST|Sakshi
వివేకానందనగర్‌ వెంచర్‌లో ప్రభుత్వ భూమి హద్దుల కోసం సర్వే చేసేందుకు వచ్చిన సర్వేయర్‌
– పెబ్బేరులో ప్రభుత్వ భూమిపై కన్ను
– సర్వే పేరుతో వ్యాపారులకు సహకారం
– ఫిర్యాదు చేసినా స్పందించని అధికారులు
పెబ్బేరు : మండల కేంద్రం నుంచి వనపర్తికి వెళ్లే ప్రధాన రోడ్డులో కొందరు రియల్‌ వ్యాపారులు వివేకానందనగర్‌ పేరుతో ఇటీవల ఏడెకరాల్లో వెంచర్‌ ఏర్పాటుచేశారు. ఆ పక్కనే ప్రభుత్వ భూమి ఉండటంతో వారి కన్ను దీనిపై పడింది. అందూలోనూ దర్జాగా ప్లాట్లను చేసి అమ్మకానికి పెట్టారు. అక్కడ అక్రమంగా పార్కు నిర్మిస్తుండడాన్ని స్థానిక అంబేద్కర్‌కాలనీ వాసులు గమనించారు. వారం రోజుల క్రితమే ఈ పనులను అడ్డుకుని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ వెంచర్‌లో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేయాలని కోరారు. సర్వే నం.3లో 14గుంటలు, ఇంకా ఇతర సర్వే నంబర్లలోనూ ప్రభుత్వ భూములున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడంలేదని అంబేద్కర్‌ యువజన సంఘం సభ్యులు ఈశ్వర్, గోవిందు, రాముడు ఆరోపించారు. కాగా, నాలుగు రోజుల క్రితం సర్వే చేసేందుకుగాను ఆర్‌ఐ లావణ్య, సర్వేయర్‌ రామకష్ణ అక్కడికి వచ్చినా కాసేపు అటు ఇటు తిరిగి పాయింట్‌ దొరకడం లేదంటూ వెళ్లిపోయారు. పెబ్బేరు–వనపర్తి ప్రధాన రోడ్‌లో ఉన్న ఈ ప్రభుత్వ భూమి ప్రస్తుతం రూ.లక్షల్లో పలుకుతుండటంతో స్థానిక రెవెన్యూ అధికారులు రియల్‌ వ్యాపారులకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై తహసీల్దార్‌ దత్తాద్రీని వివరణ కోరగా త్వరలో ఆ స్థలాన్ని పకడ్బందీగా సర్వే చేయిస్తామన్నారు.  హద్దులు ఏర్పాటుచేసి ప్రభుత్వ భూమిని తమ అధీనంలోకి తీసుకుంటామన్నారు.
 
 
మరిన్ని వార్తలు