బాలయ్యన్నా లెక్క లేదు.. నా లెక్క నాదే

28 Feb, 2017 22:53 IST|Sakshi
బాలయ్యన్నా లెక్క లేదు.. నా లెక్క నాదే

ఓ రియల్టర్‌కు చుక్కలు చూపించిన మంత్రి
సినీనటుడు బాలకృష్ణ పేరు ప్రస్తావించినా బేఖాతరు
నెలల తరబడి ‘నాలా’ ఫైల్‌ తొక్కిపెట్టించిన వైనం
రియల్‌ వెంచర్‌కు రూ. 4 కోట్ల డిమాండ్‌
చివరికి రూ. 3 కోట్లకు తెగిన  బేరం?
ఇప్పుడు టీడీపీలో ఇదే చర్చనీయాంశం


ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రముఖుల పేర్లు చెబితే.. కాని పనులు కూడా జరిగిపోతుంటాయి.. అందునా.. సీఎం స్థాయి వ్యక్తుల సన్నిహితులను రిఫరెన్స్‌గా వాడితే.. క్షణాల్లో పని జరిగిపోవాల్సిందే.. కానీ ఒక భూమి మార్పిడి కేసులో ఓ రియల్టర్‌ ప్రయోగించిన సినీనటుడు బాలయ్య అస్త్రం.. జిల్లాకు చెందిన ఓ మంత్రిగారి ముందు తుస్సుమంది.. అలాగని.. ఆ మంత్రిగారేమీ మడికట్టుకొని కూర్చోలేదు.. నిర్మొహమాటంగా మాట్లాడారు.. సీఎం వియ్యంకుడి పేరు ప్రస్తావించిన రియల్టర్‌ను పిలిపించి క్లాస్‌ పీకారు.. బాలయ్య తెలుసా.. అయితే ఏంటి?.. నా లెక్క నాదే.. ఆ లెక్క ఇస్తేనే పనవుద్ది.. అని లెక్కలేనితనంతో వ్యవహరించారు.. ముక్కుపిండి మరీ లెక్క వసూలు చేశారు. టీడీపీవర్గాలే ముక్కున వేలేసుకొని చర్చించుకుంటున్న ఈ డీల్‌ వెనుక ఏం జరిగిందంటే..

విశాఖపట్నం: నగరానికి చెందిన ఓ సినిమా డిస్ట్రిబ్యూటర్‌ కమ్‌ రియల్‌ ఎస్టేట్‌ అధినేత నగర శివారులో భారీ వెంచర్‌కు శ్రీకారం చుట్టారు. ఆనందపురం మండలం శొంఠ్యాం పరిసరాల్లో సుమారు పాతిక ఎకరాల్లో ఆయన ప్రతిపాదించిన వెంచర్‌ పరిధిలో పంట పొలాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో వాటిని వ్యవసాయేతర భూములుగా మార్పించుకునేందుకు అవసరమైన ‘నాలా’ అనుమతుల కోసం రెవెన్యూ అధికారులను సంప్రదించారు. దరఖాస్తు కూడా సమర్పించారు. అన్నీ పక్కాగా ఉన్నా అనుమతులు మాత్రం రావడం లేదు. నెలల తరబడి  రెవెన్యూ వర్గాలను  సంప్రదిస్తున్నా అటు నుంచి సానుకూల స్పందన రాలేదు. పోనీ సమస్య ఏమిటో కూడా వారు చెప్పడం లేదు. చివరికి ఆ రియల్టర్‌ రెవెన్యూ ఉన్నతాధికారిని కలిసి.. ‘కొన్ని నెలలుగా  తిరుగుతున్నాం.. ఫైల్‌ ఎందుకు ఆపుతున్నారో అర్థం కావడంలేదు.. ఏమైనా ఫార్మాలిటీస్‌ కావాలంటే చెప్పండి.. ఇచ్చేస్తాం’ అని మొరపెట్టుకున్నారు. అసలు విషయం ఆ ఉన్నతాధికారి చెబితే కానీ సదరు రియల్టర్‌కు అర్థం కాలేదు. ‘మంత్రి గారిని కలిసి.. ఫార్మాలిటీస్‌ ఇవ్వకుండా అక్కడ అంత భారీ వెంచర్‌ ఎలా వేస్తారని’ ఆ ఉన్నతాధికారి ప్రశ్నించారు. తత్వం బోధపడిన రియల్టరు వెంటనే సదరు మంత్రి సన్నిహితులను కలుసుకున్నారు. కానీ ఆ మంత్రి వర్గీయులు పెట్టిన ఇండెంట్‌ విని ఆయనకు కళ్లు తిరిగినంత పనైంది. ఏకంగా రూ. 4 కోట్లు డిమాండ్‌ చేయగా.. అంత ఇచ్చుకోలేమని, రూ. కోటి వరకు ఇస్తామని బేరమాడారట. ‘నాలుగు’కు నయాపైసా కూడా తగ్గేది లేదని మంత్రి వర్గీయులు తెగేసి చెప్పడంతో  చివరి ప్రయత్నంగా ఆ రియల్టరు సినీనటుడు, హిందుపూర్‌ ఎమ్మెల్యే బాలకృష్ణ అస్త్రం ప్రయోగించారని అంటున్నారు.

సినిమా డిస్ట్రిబ్యూటర్‌గా గతంలో బాలకృష్ణ సినిమాలను ఇక్కడ పంపిణీ చేయడంతో పాటు నేరుగా ఒకింత పరిచయం ఉన్న నేపథ్యంలో ఆయనతోనే చెప్పించాలని చూశారు. బాలయ్య వద్దకు విషయం వెళ్లేలా ఉందని పసిగట్టిన మంత్రి.. ఆ రియల్టర్‌ను పిలిపించి గట్టిగా క్లాసు పీకారట. ‘బాలయ్య చెప్పినా.. ఎవరు చెప్పినా... మన లెక్క మనకివ్వాల్సిందే..  వాటా వచ్చే వరకూ ఫైలు కదిలేది లేదంటూ ఉన్నతాధికారులకు సైతం  స్పష్టం చేయడంతో  చివరికి చేసేది లేక మూడు కోట్లకు బేరమాడుకుని వ్యవహారాన్ని సెటిల్‌ చేయించుకున్నట్టు తెలుస్తోంది. ప్రతి పనికీ ఇండెంట్లు వేసే మంత్రి సంగతి అందరికీ తెలిసిన విషయమే కానీ.. స్వయానా సీఎం చంద్రబాబు వియ్యంకుడైన బాలకృష్ణ తెలుసన్నా లెక్క చేయకపోవడమే ఇప్పుడు టీడీపీ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వార్తలు