ప్రసాదులపై తిరుగుబాటు

29 Jul, 2016 22:46 IST|Sakshi
ప్రసాదులపై తిరుగుబాటు

తక్షణమే దించేయాలని సొంత పార్టీ కౌన్సిలర్ల డిమాండ్‌

నేడు అశోక్‌ను కలిసేందుకు సన్నద్ధం

సాక్షి ప్రతినిధి, విజయనగరం : విజయనగరం మున్సిపాల్టీలో అసమ్మతి రాజకీయాలు వేడెక్కాయి. చైర్మన్‌ ప్రసాదుల రామకష్ణపై తిరుగుబావుటా ఎగరవేసేందుకు రంగం సిద్ధమయ్యింది. ఏకపక్ష వైఖరీ, అవినీతి అక్రమాలపై కడిగి పారేసేందుకు నేతలు సన్నద్ధమవుతున్నారు. ప్రసాదులను తక్షణమే దించేసి, ఆయన స్థానంలో మరొకర్ని నియమించాలన్న డిమాండ్‌తో కేంద్రమంత్రి అశోక్‌ గజపతిరాజును కలిసేందుకు సమాయత్తమవుతున్నారు. శనివారం ఉదయమే అందుకు ముహూర్తం పెట్టుకున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే మీసాల గీతకు, పట్టణ అధ్యక్షుడు డాక్టర్‌ వి.ఎస్‌.ప్రసాద్‌కు సమాచారమందించామని అసమ్మతి వాదులు చెబుతున్నారు. 
 
సొంతపార్టీలోనే ప్రసాదుల ముసలం
మున్సిపల్‌ చైర్మన్‌ ప్రసాదుల రామకష్ణ పనితీరు సొంత పార్టీ కౌన్సిలర్లకే రుచించడం లేదు. ఆయన అధికారంలోకి వచ్చాక మున్సిపల్‌ పరిస్థితి దయనీయంగా తయారైందని ఆ పార్టీ కౌన్సిలర్లు అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు. పట్టణ అభివద్ధి కుంటుపడటమే కాకుండా అవినీతి పెచ్చు మీరిపోయిందని, రోజురోజుకు ఆయన అక్రమాలు ఎక్కువవుతున్నాయని కౌన్సిలర్లు అంతర్గతంగా మండి పడుతున్నారు. పాలకవర్గం ఏర్పాటై రెండేళ్లు దాటినా పరిస్థితుల్లో మార్పులేదని, పట్టణ అభివద్ధికి విఘాతంగా తయారయ్యారని ధ్వజమెత్తుతున్నారు. ఆ మధ్య ఇదే విషయమై కొందరు కౌన్సిలర్లు గొడవ పడ్డారు. ముఖ్యంగా మహిళా కౌన్సిలర్లు ఇబ్బంది పడ్డారు. మహిళలని చూడకుండా మాట్లాడుతున్నారని, ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని కొందరు బా«ధపడ్డారు. కౌన్సిలర్లు రొంగలి రామారావు, మేకా అనంతలక్ష్మి నాయకత్వంలో తిరుగుబావుటా ఎగురవేసేందుకు సిద్ధమవుతున్నారు. కేంద్రమంత్రి అశోక్‌ గజపతిరాజును కలిసి ఫిర్యాదు చేయాలన్న నిర్ణయానికొచ్చారు. అన్నింటా విఫలమైన చైర్మన్‌ను తొలగించి, ఆయన స్థానంలో మరొకర్ని నియమించాలని డిమాండ్‌ చేయనున్నారు. ఇప్పటికే కౌన్సిలర్లందరికీ ఫోన్‌లు చేసి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేసారు. మెజార్టీ కౌన్సిలర్లు అసమ్మతి వాదులకు బాసటగా నిలిచినట్టు తెలిసింది.
 
 
అసమ్మతివాదుల ఆరోపణలివి
పట్టణ పారిశుద్ధ్య నిర్వహణలో విఫలమయ్యారు. పనులకేటాయింపులోనూ వివక్ష కొనసాగుతోంది. ప్లాస్టిక్‌ వినియోగంపై వసూలు చేసిన అపరాధ రుసుమును పక్కదారి పట్టించారు. హుద్‌హుద్‌లో పడిపోయిన టేకు చెట్లను మాయం చేశారు. మున్సిపల్‌ వాహనాల ఆయిల్‌ వినియోగంలో అవకతవకలు జరుగుతున్నాయి. లబ్ధిచేకూరే వాటికి ఆమోదం తెలుపుతూ... మిగిలినవాటిని పక్కన పెడుతున్నారు. మొక్కలు, ఫినాయిల్‌ కొనుగోలులో గోల్‌మాల్‌ జరుగుతోంది. మున్సిపల్‌ కార్యాలయంలోని పాత ఇనుమును వేలం వేయకుండా పక్కదారి పట్టించారు. తదితర విమర్శలతో కేంద్ర మంత్రి వద్దకు వెళ్లనున్నారు.
 
 
అశోక్‌కు ఫిర్యాదు చేస్తాం: కౌన్సిలర్‌ రొంగలి
మున్సిపల్‌ చైర్మన్‌ ప్రసాదుల రామకష్ణపై కేంద్రమంత్రి అశోక్‌ గజపతిరాజుకు ఫిర్యాదు చేయనున్నామని టీడీపీ కౌన్సిలర్‌ రొంగలి రామారావు ‘సాక్షి’కి తెలిపారు. చైర్మన్‌ ఒంటెత్తు పోకడ, అక్రమాలను అశోక్‌ దష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఆయన్ని దించేసి, మరొకర్ని పెట్టాలని డిమాండ్‌ చేయనున్నామన్నారు. తాము చేస్తున్న ఆరోపణలన్నీ రుజువు చేసేందుకు కూడా తాను సిద్ధమన్నారు. 
 

మరిన్ని వార్తలు