నిర్లక్ష్యపు గండ్లు

6 Aug, 2016 01:25 IST|Sakshi
gandi
బల్లికురవ : 
- అద్దంకి బ్రాంచ్‌ కెనాల్‌కు రెండు చోట్ల భారీ గండ్లు
- 400 ఎకరాల్లో పంటలకు తీవ్ర నష్టం
- సాగర్‌ నుంచి విడుదలైన తాగునీరు వృథా
-  కాల్వలపై కొరవడిన పర్యవేక్షణ 
- గండ్లను పరిశీలించిన కలెక్టర్‌ సుజాతశర్మ
- అధికారుల తీరుపై మండిపాటు 
- యుద్ధ ప్రాతిపదికన గండ్లు పూడ్చాలని ఆదేశం
- సామర్థ్యానికి మించి నీరు విడుదల చే శారంటున్న రైతులు 
 
తాగునీటి అవసరాల కోసం ప్రభుత్వం సాగర్‌ జలాలు విడుదల చేసింది. అధికారుల సమన్వయ లోపం వల్ల కాల్వలకు గండ్లుపడి తాగునీరు వృథాగా పోతోంది. కాల్వలపై పర్యవేక్షించే వారంతా ఏం చేస్తున్నారు..? అంటూ జిల్లా కలెక్టర్‌ సుజాతశర్మ అధికారులపై మండిపడ్డారు. జిల్లా ప్రజల తాగునీటి అవసరాల కోసం అద్దంకి బ్రాంచి కెనాల్‌(ఏబీసీ)కు నాగార్జునసాగర్‌ నుంచి విడుదల చేసిన నీరు ఉద్ధృతంగా ప్రవహించడంతో శుక్రవారం వేకువజామున రెండు చోట్ల భారీ గండ్లు పడ్డాయి. ఏబీసీ కెనాల్‌కు బొల్లాపల్లి లాకుల సమీపంలో దక్షిణం వైపు కట్టకు (32.5 మైలు వద్ద) 40 మీటర్ల లోతు, 40 మీటర్ల వెడల్పున రెండు భారీ గండ్లు పడటంతో   
 
ఖరీఫ్‌ ఆరంభ పైర్లుగా సాగు చేసిన పెసర, నువ్వు, కూరగాయల పంటలు నీట మునిగాయి. కొమ్మినేనివారి గ్రామ పరిధిలో సుమారు 400 ఎకారాల్లో పంట మేట వేసి, రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. గండ్లు కారణంగా నీటి సరఫరాను శుక్రవారం ఉదయం నుంచి నిలుపుదల చేశారు.  కాల్వకు గండ్లు పడిన సమాచారం అందుకున్న కలెక్టర్‌ ఉదయం 11గంటల సమయంలో వెళ్లి గండ్లను పరిశీలించారు. రెండు గండ్లను యుద్ధ ప్రాతిపదికన పూడ్చి, మంచినీటి విడుదలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఎన్‌ఎస్‌పీ, రెవెన్యూ, ఆర్‌ డబ్ల్యూఎస్‌ అధికారులను ఆదేశించారు. అన్ని స్టోరేజి చెరువులను పూర్తి స్థాయిలో నింపుకోవాలని స్టోరేజ్‌ కమిటీలను ఆదేశించారు.
కరణం ఆధ్వర్యంలో గండ్లు పూడ్చివేత..
కలెక్టర్‌ గండ్లు పరిశీలించేందుకు వెళ్లిన సమయంలో రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షుడు కరణం బలరామకృష్ణమూర్తి, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కరణం వెంకటేష్, ఒంగోలు ఆర్డీవో కె.శ్రీనివాసరావు, ఎన్‌ఎస్‌పీ ఎసీ శారద ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ ఉమహేశ్వరరావు బల్లికురవ, అద్దంకి తాహశీల్దార్లు శింగారావు, అశోకవర్ధన్, పలువురు స్థానిక నేతలు అక్కడికి వెళ్లారు. కరణం బలరాం, వెంకటేశ్‌లు దగ్గరుండి గండ్లు పూడ్చివేత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్థానిక ఈర్ల కొండ నుంచి గ్రానైట్‌ వ్యర్ధాలను టిప్పర్ల ద్వారా తెప్పించి ప్రొక్లెయిన్‌తో పూడ్చారు. పనులు పూర్తయ్యే వరకు అక్కడే ఉండి, పర్యవేక్షించారు. వైఎస్సార్‌ సీపీ పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్త గొట్టిపాటి భరత్‌ కూడా గండ్లను పరిశీలించారు. 
మంత్రి శిద్దా పరిశీలన..
ఏబీసీ కెనాల్‌కు గండిపడిన ప్రదేశాన్ని శుక్రవారం రాత్రి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావు పరిశీలించారు. అధికారులు స్థానిక నేతలతో సమీక్షించారు. 
పోలీసుల మోహరింపు..
టీడీపీ నేతలు బలరాం, గొట్టిపాటి కాలువను పరిశీలించటానికి రావటంతో పోలీసులు మరోసారి బలగాలను దించక తప్పలేదు. దర్శి డీఎస్సీ శ్రీరాంబాబు ఆధ్వర్యంలో కాల్వ కట్లకు రెండు వైపుల పోలీసు భద్రత ఏర్పాటు చేశారు.  
సామర్థ్యానికి మించిన నీరే కొంప ముంచింది..
కాలువ సామర్దా్యనికి మించి నీరు విడుదల చేయటం వల్లే గండ్లు పడ్డాయని కొమ్మినేనివారిపాలెం, బొల్లాపల్లి గ్రామరైతులు చెబుతున్నారు. ఈ కాలువకు 1200 క్యూసెక్యుల నీరు మాత్రమే ప్రవహించే అవకాశం ఉంది. అటువంటిది 1400 క్యూసెక్కుల నీరు విడుదల చేయటం. 33/0 వద్ద అద్దంకి మేజర్‌ నీటి విడుదల చేయకపోవటం వల్ల గండ్లు పడ్డాయని వాపోతున్నారు. ఈ కాలువకు దక్షిణం వైపు కట్ట బలహీనంగా ఉంది. రెండేళ్ల కిందట కూడా ఇదేప్రాతంలో రెండుచోట్లు గండ్లు పడ్డాయి. ఇప్పటికైనా అధికారులు అప్రమత్తమై పూర్తి స్థాయిలో కట్టలు పటిష్ట పరచాలని రైతులు వేడుకుంటున్నారు. 
 
బూదవాడ మేజర్‌కూ గండి..
పంగులూరు: బూదవాడ మేజర్‌ కాలువలోకి శుక్రవారం చెరువులకు నీరు నింపేందుకు వచ్చిన కొద్దిపాటి నీటి ప్రవాహనికే గ్రామంలోని ధనలక్ష్మి కాలనీ పక్కన గల కాలువకు గండి పడింది. చుట్టు పక్కల పొలాల్లో నీరు చేరింది. గండి పడినా అధికారులు ఎవ్వరు స్పందిచకపోవడంతో గ్రామస్తులే మట్టి బస్తాలు అడ్డుగా వేసి కొంతమేర నీటి ప్రవాహాన్ని ఆపారు. ప్రస్తుతం ప్రపంచ బ్యాంక్‌ నిధులతో సాగర్‌ కాలువ ఆధునీకరణ పనులు వేగవంతంగా చేశారు. కొద్దిపాటి ప్రవాహానికే ఇలా గండ్లు పడుతున్నాయి.
 
మరిన్ని వార్తలు