పొందూరు ఖాదీకి విశిష్ట గుర్తింపు

14 Aug, 2016 23:42 IST|Sakshi
పొందూరు ఖాదీకి విశిష్ట గుర్తింపు
• పొందూరు ఖాదీకి పేటెంట్‌ హక్కును కల్పించిన కేంద్ర ప్రభుత్వం 
• వారసత్వ, సంస్కృతి, సంప్రదాయాలకు చిహ్నంగా గుర్తింపు
• ఖాదీ కార్మికులను ఆదుకునేందుకు హెరిటేజ్‌ క్లస్టర్‌ ఏర్పాటుకు సన్నాహాలు
 
పొందూరు: పొందూరు ఖాదీకి భారత ప్రభుత్వం విశిష్ట గుర్తింపునిచ్చింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఖాదీ విలేజ్‌ ఇండ్రస్ర్‌ కమిషన్‌(కేవీఐసీ) చైర్మెన్‌ సక్సేనాలు పొందూరు ఖాదీని వారసత్వ, సంస్కృతి, సంప్రదాయాలకు చిహ్నంగా గుర్తించారు. ఫలితంగా  కేంద్ర ప్రభుత్వం పొందూరు ఖాదీకి పేటెంట్‌ హక్కును ప్రకటించింది. దీనిక సంబంధించిన వస్త్రాలపై ముద్రించేందుకు ఖాదీ లోగో ( చిహ్నం)ను ఏర్పాటు చేశారు. ఫైన్‌ ఖాదీ వస్త్రాలు నేసిన కార్మికులకు సంబంధించి నేత పనివారికి 10 శాతం, వడుకు పనివారికి 20 శాతం మజూరీలు పెంచేందుకు సమాలోచనలు చేస్తున్నట్టు ఇటీవల సందర్శించిన  కేవీఐసీ డివిజనల్‌ డైరెక్టర్‌ ఎం.భూమయ్య వెల్లడించారు.
 
స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించిన ఖాదీ...
 
విదేశీ వస్తు బహిష్కరణలో భాగంగా ఖాదీ వస్త్రాలు దేశ ప్రజల్లో స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించాయి. ఉప్పు సత్యాగ్రహానికి తోడుగా మన ఖాదీ వస్త్రాలను మనమే ధరించాలనే నినాదం తారాస్థాయికి చేరుకోవడంతో ఖాదీ ఉద్యమానికి నాంది పలికింది.  ఆ నేపధ్యంలో పొందూరు ఖాదీపై గాంధీ దృష్టి కేంద్రీకరించి, అతని మనుమడు దేవదాస్‌ గాంధీని 1921లో  పొందూరుకు పంపించారు.  అప్పటి నుంచి దేశ వ్యాప్తంగా పొందూరు ఖాదీ వస్త్రాలు చలామనీ అయ్యాయి. భూదాన ఉద్యమంలో భాగంగా ఆచార్య వినోభాబావే పొందూరు గ్రామాన్ని  సందర్శించినప్పుడు 1955 అక్టోబర్‌ 13న చేనేత సంఘ భవనానికి శంకుస్థాపన చేశారు.  కేవీఐసీ (ఖాదీ గ్రామోద్యోగ కమిషన్‌) ఆధ్వర్యంలో ఏఎఫ్‌కేకే (ఆంధ్రాపైన్‌ ఖాధీ కార్మిక అభివృద్ధి సంఘం)గా నామకరణం చేసింది.  ఈ సంఘం పరిధిలో సుమారు 26 గ్రామాల ప్రజలు జీవనం సాగిస్తున్నారు. వందమంది నేతకార్మికులు, 900 మంది నూలు వడుకువారు ఎనిమిది మండలాల్లో విస్తరించి ఉన్నారు. ఖాదీ ఉత్పత్తుల అమ్మకాలకు జిల్లాలో ఒక ఉత్పత్తి విక్రయశాల, 4 ఉత్పత్తి కేంద్రాలు, 9 విక్రయాల ఖాధీ బాండాగారాలు ఏర్పాటు చేశారు. 
 
చేపముల్లే సాధనంగా...
 
నాణ్యమైన పత్తి నుంచి దారం తీసి ఖద్దరు వస్త్రాన్ని తయారుచేయడం ఇక్కడ నేత కార్మికుల ప్రత్యేకత. ఖద్దరు ఉత్పత్తుల తయారీకి చేపముల్లే సాధనంగా ఉపయోగించడం విశేషం. చేపముల్లుతో శుభ్రం చేసిన పత్తిని చేతితో వడికి నూలును తీసి చేమగ్గంపై వస్త్రం నేస్తారు. ఇదే అసలైన పొందూరు ఖాదీ. మిషన్‌మీద నూలును తీసి వస్త్రాన్ని తయారు చేసి నకిలీ ఖాదీని విక్రయిస్తూ కార్మికుల పొట్టకొట్టేయడం వ్యాపారుల చేస్తున్న దుర్మార్గం.  దీనిని నియంత్రించేందుకే కేంద్ర ప్రభుత్వం పొందూరు ఖాదీకి పేటేంట్‌ హక్కును కల్పించింది. వాస్తవానికి ఖాదీ కార్మికులు అర్ధాకలితో జీవిస్తున్నారు. పేటెంట్‌ హక్కుతో పాటు మజూరీలు పెంచితేనే వారు మనుగడ సాగించేందుకు అవకాశం ఉంటుంది.
 
 
 
 
మరిన్ని వార్తలు