జీహెచ్‌ఎంసీ ఓట్ల పునఃపరిశీలన

5 Nov, 2015 09:59 IST|Sakshi
జీహెచ్‌ఎంసీ ఓట్ల పునఃపరిశీలన

సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఓటర్ల తొలగింపు వ్యవహారంపై కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. 24 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఓటర్ల జాబితాలను పునః పరిశీలించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. నగరంలో బీసీ ఓటర్లను గుర్తించేందుకు జీహెచ్‌ఎంసీ చేస్తున్న ఇంటింటి సర్వే ఈనెల 18లోగా ముగియనుంది. పనిలో పనిగా ఈ సందర్భంగా తొలగించిన ఓట్లన్నీ పునఃపరిశీలన జరపాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ కమిషనర్, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల కలెక్టర్లకు ఈ బాధ్యతలు అప్పగించింది. అకారణంగా లక్షలాది ఓట్లు గల్లంతైనట్లుగా వచ్చిన అభియోగాలు, వివిధ పార్టీలు ఇచ్చిన ఫిర్యాదులపై  కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవలే 14 మంది అధికారుల బృందంతో విచారణ జరిపించింది.

పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సునీల్ గుప్తా సారథ్యంలో హైదరాబాద్‌కు వచ్చిన ఈ బృందం వివిధ పార్టీల ప్రతినిధులతో సమావేశమైంది. రెండు రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో  పలువురు ఓటర్లను ముఖాముఖి కలిసి నిజానిజాలు ఆరా తీసింది. ఈ సందర్భంగా వెల్లువెత్తిన ఫిర్యాదులతో.. భారీ సంఖ్యలోనే ఓట్లు గల్లంతైనట్లుగా ఈ బృందం గుర్తించింది. వీరిచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా ఓటర్ల పునఃపరిశీలనకు ఈసీ నిర్ణయించింది. తొలిగించిన ఓట్లన్నీ ఇంటింటికి వెళ్లి పరిశీలించాలని.. వారిచ్చే అప్పీళ్లను స్వీకరించాలని ఆదేశించింది. ఈ సర్వే సందర్భంగా ఇంటింటికి వచ్చే బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్‌వో)లకు సహకరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ బుధవారం ప్రకటన విడుదల చేశారు. ఓటర్ల జాబితాలో తమ పేర్లను  తొలిగించినట్లు గుర్తిస్తే.. తగిన ధ్రువీకరణ పత్రాలతో బీఎల్‌వోలకు అప్పీలు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

మరిన్ని వార్తలు