కనక వర్షం..!

11 Nov, 2016 23:54 IST|Sakshi
కనక వర్షం..!





విజయవాడ సెంట్రల్‌/విజయవాడ : పెద్ద నోట్ల రద్దు నిర్ణయం విద్యుత్, మున్సిపల్‌ శాఖలకు మేలు చేసింది. బిల్లులు చెల్లించేందుకు పాత రూ.500, రూ.1,000 నోట్లు తీసుకునేలా ఆ శాఖల అధికారుల రచించిన పథకం œలించింది. ముందస్తు ప్రచారం లేకపోయినా రెండు శాఖలకు ఒక్క రోజులోనే భారీగా ఆదాయం సమకూరింది. మొండి బకాయిలు సైతం వసూలయ్యాయని ఆయా శాఖల అధికారులు తెలిపారు. పాత రూ.500, రూ.1,000 నోట్లతో వివిధ రకాల పన్నులు, బిల్లులు చెల్లించేందుకు ప్రజలకు అవకాశం కల్పించారు. దీంతో విజయవాడ సర్కిల్‌ పరిధిలో రికార్డు స్థాయిలో విద్యుత్‌ బిల్లులు వసూలయ్యాయి. ఇందులో అత్యధికం పాత బకాయిలు ఉన్నట్లు ఏపీఎస్పీడీసీఎల్‌ అధికారులు తెలిపారు. సాధారణంగా రోజూ రూ.3.5 కోట్లు వరకు బిల్లులు వసూలు అయ్యేవి. అయితే పాత పెద్ద నోట్లు తీసుకుంటామని అధికారులు ప్రకటించడంతో ఒక్క శుక్రవారమే రూ.6 కోట్ల వరకు వసూలయ్యాయి. ఈ నెల 14వ తేదీ వరకు పాత రూ.500, రూ.1,000 నోట్లు స్వీకరిస్తామని అధికారులు తెలిపారు.
కార్పొరేషన్‌కు భారీ ఆదాయం
విజయవాడ నగరపాలక సంస్థకు శుక్రవారం ఉదయం నుంచి రాత్రి 9.15 గంటల వరకు రూ.4,76,27,747 మేర పన్నులు వసూలయ్యాయి. అర్ధరాత్రి 12 గంటల వరకు పన్నులు చెల్లించేందుకు అవకాశం ఉండటంతో ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉంది. ఒక్కరోజులో ఇంత పెద్ద మొత్తంలో కలెక్షన్‌ రావడం కార్పొరేషన్‌ చరిత్రలో రికార్డు అని అధికారులు చెప్పారు. సాధారణ రోజుల్లో రూ.70 లక్షల నుంచి రూ.1.20 కోట్ల వరకు పన్నులు వసూలవుతాయి. మార్చి 31వ తేదీ రూ.2.50 కోట్ల మేర పన్నులు వసూలవుతాయని రెవెన్యూ ఉద్యోగులు తెలిపారు. ఉదయం 8 గంటల నుంచే మూడు సర్కిల్‌ కార్యాలయాలు, కార్పొరేషన్‌ ప్రధాన కార్యాలయం, మీ–సేవా కేంద్రాల్లో పన్నులు కట్టించుకోవడం ప్రారంభించారు. అన్ని కేంద్రాల వద్ద బకాయిదారులు క్యూ కట్టారు. కృష్ణలంక పాతపోలీస్‌ స్టేషన్‌ రోడ్డు, పటమట సర్కిల్‌–3 కార్యాలయం, ఆర్టీసీ కాలనీ సాయిబాబా గుడివద్ద, మీ–సేవా కేంద్రాల్లో పన్ను వసూళ్ల తీరును కమిషనర్‌ జి.వీరపాండియన్‌ పరిశీలించారు. రద్దీ ఎక్కువగా ఉన్న కేంద్రాల్లో అదనపు సిబ్బందిని ఏర్పాటుచేశారు.
మరో మూడు రోజులు వసూళ్లు
పెద్ద నోట్లతో మరో మూడు రోజుల పాటు పన్నులు చెల్లించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించినట్లు తెలిసింది. ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రి వరకు చెల్లింపులు జరపవచ్చని అధికారులు తెలిపారు. నగరపాలక సంస్థకు  మొండి బకాయిలు రూ.100 కోట్లపైనే ఉన్నాయి. ఈక్రమంలో గడువు పెంపు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనేందుకు నగరపాలక సంస్థ అధికారులు కసరత్తు చేస్తున్నారు. రానున్న మూడు రోజుల్లో కనీసం రూ.30 కోట్ల మేర పన్నులు వసూలు చేయాలని కసరత్తు చేస్తున్నారు.





 

మరిన్ని వార్తలు