రికార్డు నృత్యం..

6 Nov, 2016 23:03 IST|Sakshi
రికార్డు నృత్యం..
 జంగారెడ్డిగూడెం : కూచిపూడి నృత్య చరిత్రలో నూతన అధ్యాయం. 500 మంది విద్యార్థినీ, విద్యార్థులు ఏక కాలంలో శిరస్సున మంచినీటి బాటిళ్లు ధరించి నత్య ప్రదర్శనతో వహ్వా అనిపించారు. ఎక్కడా తడబడకుండా వీరు చేసిన నృత్యం ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్ట్‌స్‌కు ఎక్కింది. ఈ అద్భుత ఘట్టం ఆదివారం జంగారెడ్డిగూడెం జెడ్పీ హైస్కూల్‌లో ఆవిష్కృతమైంది. 
స్థానిక అభినయ కూచిపూడి నాట్య అకాడమీ 25వ కూచిపూడి దేశభక్తి గీతాల నృత్య కళాత్సోవాల్లో భాగంగా విద్యార్థినీ, విద్యార్థుల చేత ఈ ప్రదర్శన ఇప్పించారు. రాష్ట్ర భక్తి గీతం ‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ’ అంటూ విద్యార్థినులు 13.56 నిమిషాలు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం అబ్బుర పరిచింది. ప్రదర్శనను ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డŠస్‌ ప్రతినిధి బి.స్వదీప్‌రాయ్‌ చౌదరి ప్రత్యక్షంగా తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డŠస్‌లో ఈ నృత్య ప్రదర్శనకు స్థానం కల్పిస్తున్నట్టు ప్రకటించారు. ఇండియాలోనే ఈ తరహా ప్రదర్శన ఇదే మొట్టమొదటిదని, అందుకే రికార్డు సాధించిందని వెల్లడించారు. ఈ మేరకు ధ్రువీకరణ పత్రాన్ని కార్యక్రమ నిర్వాహకురాలు, అభినయ కూచిపూడి నాట్య అకాడమీ  వ్యవస్థాపకురాలు , నాట్యమయూరి, తెలుగు బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు గ్రహీత ఎస్‌.రూపాదేవిని అందించారు. ఈ ప్రదర్శనలో స్థానిక ప్రతిభ, భాష్యం, కిడ్స్, గురుకుల పాఠశాలల విద్యార్థులతో పాటు అభినయ కూచిపూడి నాట్య అకాడమికి చెందిన జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం విద్యార్థులు, ఇండియన్‌ యూపీ స్కూల్, అక్షర పాఠశాల, సరిపల్లికి చెందిన ఎంవీఆర్‌ విద్యానికేతన్‌ చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. న్యాయ నిర్ణేతలుగా సుకవిత నాట్యాచార పసుమర్తి శ్రీనివాసశర్మ, మహిళా కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ లక్ష్మికుమారి వ్యవహరించారు. తొలుత నటరాజ పూజా కార్యక్రమాలను చిట్రోజు తాతాజీ దంపతులు, బాలాజీరావు దంపతులు నిర్వహించారు. కార్యక్రమాన్ని తిలకించిన ఏలూరు ఎంపీ మాగంటి బాబు మాట్లాడుతూ అభినయ కూచిపూడి నాట్య అకాడమీకి ప్రభుత్వం నుంచి అకాడమీ ఏర్పాటు కు భూమిని కేటాయిస్తామని ప్రకటించారు. అలాగే అమరావతిలోను అవకాశం ఉంటే రిపబ్లిక్‌ డే పరేడ్‌ ఈ ప్రదర్శన ఇచ్చేందుకు అనుమతులు తీసుకుంటానని తెలిపారు. మంత్రి పీతల సుజాత ఫోన్లో అభినందనలు తెలిపారు. నగర పంచాయతీ చైర్‌పర్సన్‌ బంగారు శివలక్ష్మి, ఎంపీపీ కె.మాణిక్యాంబ, జెడ్పీటీసీ శీలం రామచంద్రరావు, డీసీసీబీ మాజీ చైర్మన్‌ కె.రాంబాబు, మండవ లక్ష్మణరావు, సిటీకేబుల్‌ ఎండీ పాలపర్తి శ్రీనివాస్, షేక్‌ ముస్తఫా, పెనుమర్తి రామ్‌కుమార్, బండారు సత్యనారాయణ, దల్లి రామాంజనేయరెడ్డి, ప్రముఖ శిల్పి దేవికారాణి ఒడయార్, ఆకాశవాణి ప్రతినిధి బి.జయప్రకాష్, కళాకారులు, అధికారులు కార్యక్రమాన్ని వీక్షించారు. 
 
 
 
 
 
 
 
 
 
 
మరిన్ని వార్తలు