ఐదేళ్లుగా మూత.. జీతాల మోత!

2 Aug, 2016 19:35 IST|Sakshi
ఐదేళ్లుగా మూత.. జీతాల మోత!
 రెడ్‌క్రాస్‌ సొసైటీ బ్లడ్‌ బ్యాంక్‌ నిర్వాహకుల నిర్వాకం
 మూతపడినా రూ.20 లక్షల జీతాలు చెల్లింపు
 
సాక్షి, గుంటూరు : ఐదేళ్లుగా తలుపులు తెరిచిన దాఖలాలు లేవు.. అందులో పనిచేసే ఉద్యోగులకు మాత్రం నెలనెలా జీతాలు చెల్లిస్తూనే ఉన్నారు.. ఇదీ రెడ్‌క్రాస్‌ సొసైటీ బ్లడ్‌బ్యాంకు నిర్వాహకుల నిర్వాకం. జిల్లా కలెక్టర్‌ చైర్మన్‌గా ఉండే రెడ్‌క్రాస్‌ సొసైటీ బ్లడ్‌బ్యాంక్‌ను 2005లో గుంటూరు జిల్లాపరిషత్‌ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ఇందులో నగరానికి చెందిన అనేక మంది ప్రముఖులు సభ్యులుగా ఉన్నారు. 2011 వరకు బ్లడ్‌బ్యాంకును సమర్థవంతంగా నిర్వహించారు. ఎందరో నిరుపేద రోగులకు అతి తక్కువ ధరల్లో వివిధ గ్రూపుల రక్తాన్ని అందించే రెడ్‌క్రాస్‌ సొసైటీ బ్లడ్‌బ్యాంక్‌ ఐదేళ్లుగా మూతపడటంతో గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలకు చికిత్స నిమిత్తం వచ్చే పేదలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు.
పేద రోగులకు ప్రాణదానం..
రెడ్‌క్రాస్‌ సొసైటీ బ్లడ్‌బ్యాంకు గతంలో రోజుకు 35 నుంచి 40 మంది రోగులకు రక్తాన్ని సరఫరా చేస్తూ ఎందరికో ప్రాణదానం చేసింది. ప్రైవేటు బ్లడ్‌బ్యాంకుల కంటే సుమారు రూ.400 తక్కువ ధరకు రక్తాన్ని అందించి నిరుపేద రోగులకు ఊరట కలిగించింది. ప్రస్తుతం ప్రైవేటు బ్లడ్‌బ్యాంకుల్లో బ్లడ్‌ యూనిట్‌ ధర రూ.1300 ఉంది. అదే రెడ్‌క్రాస్‌ సొసైటీ బ్లడ్‌బ్యాంక్‌లో యూనిట్‌ రూ.800 నుంచి రూ.1000 లోపు ధరకే అందించేవారు.  బ్లడ్‌ బ్యాంకు చేస్తున్న సేవలను గుర్తించి అనేక మంది తమ రక్తాన్ని ఇక్కడే ఇచ్చేవారు. బ్లడ్‌బ్యాంకులో బ్లడ్‌ కాంపోనెంట్‌ సెపరేట్‌ మిషన్‌ పెట్టి ఆధునికీకరణ చేయాలని నిర్ణయించిన కమిటీలోని కొందరు సభ్యులు అందుకు సుమారు రూ.20 లక్షల నిధులు అవసరమవుతాయని గుర్తించారు. దీనితో పాటు బ్లడ్‌బ్యాంకు ఆధునికీకరణ చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో చేపట్టిన పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఐదేళ్లుగా మూతబడిన ఈ బ్లడ్‌బ్యాంకును నేటికీ తెరవలేదు.
ప్రైవేటు నిర్వాహకుల దోపిడీ...
రెడ్‌క్రాస్‌ సొసైటీ బ్లడ్‌బ్యాంకు మూతబడటంతో ప్రైవేటు బ్లడ్‌బ్యాంకుల నిర్వాహకులు పేదలను దోపిడీ చేస్తున్నారు. విషజ్వరాల బారిన పడినవారు ప్లేట్‌లెట్లు తగ్గిపోయి ప్రాణాపాయ స్థితికి చేరిన సమయంలో వారిని సాధారణ స్థితికి తేవడం కోసం ప్లేట్‌లెట్లు ఎక్కించాల్సి ఉంటుంది. ప్లేట్‌లెట్స్‌ రక్తం నుంచి వేరు చేసేందుకు ప్రత్యేక వైద్య పరికరం అవసరం. ప్లేట్‌లెట్ల కోసం అధిక మొత్తంలో ప్రైవేట్‌ బ్లడ్‌బ్యాంక్‌ నిర్వాహకులు రోగుల వద్ద అధిక మొత్తంలో డబ్బులు గుంజుతున్నారు.
ఐదేళ్లలో రూ.20 లక్షల జీతాల చెల్లింపు..
బ్లడ్‌బ్యాంకు మూతపడి ఐదేళ్లవుతున్నా అందులో పనిచేసే మెడికల్‌ ఆఫీసర్‌కు నెలకు రూ.10 వేలు చొప్పున, టెక్నీషియన్లు ముగ్గురికి రూ.6 వేలు చొప్పున, సబ్‌ స్టాఫ్‌కు రూ.15 వేలు చొప్పున జీతాలు చెల్లిస్తూ వస్తున్నారు. వీరు బయట వేరే సంస్థల్లో పనిచేస్తున్నా నెలనెలా జీతాలు అందుతూనే ఉన్నాయి. ఈ విధంగా రూ.20 లక్షల వరకు జీతాల కింద చెల్లించారు. బ్లడ్‌ కాంపోనెంట్‌ సెపరేట్‌ మిషన్‌ ఏర్పాటు చేయాలంటే రూ.20 లక్షలు నిధులు భారంగా మారిందని మూసివేసిన నిర్వాహకులు.. పనిచేయకుండానే ఉద్యోగులకు జీతాల రూపంలో రూ.20 లక్షల వరకు చెల్లించటం పలు అనుమానాలకు తావిస్తోంది. గత ఏడాది సమావేశం నిర్వహించిన కొందరు నిర్వాహకులు రెండు నెలల్లో బ్లడ్‌బ్యాంకును తెరిచేందుకు చర్యలు చేపడతామంటూ తీర్మానించారు. ఈ సమావేశం జరిగి ఏడాది దాటుతున్నా ఇంతవరకు బ్లడ్‌బ్యాంక్‌ తెరుచుకోలేదు. ఇప్పటికైనా దీనికి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న కలెక్టర్‌ స్పందించి చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. 
అనుమతులు రాగానే తెరుస్తాం..
రెడ్‌క్రాస్‌ బ్లడ్‌బ్యాంక్‌కు అనుమతుల కోసం ఎదురు చూస్తున్నాం. ఔషధ నియంత్రణ శాఖ అధికారులు మూడు నెలల క్రితం బ్లడ్‌ బ్యాంక్‌కు వచ్చి తనిఖీలు చేశారు. అనంతరం నివేదికను ఢిల్లీకి పంపారు. ఢిల్లీ నుంచి అనుమతులు రాగానే బ్లడ్‌బ్యాంక్‌ను తెరుస్తాం. సిబ్బందికి జీతాల చెల్లింపు నిజమే. మళ్లీ బ్లడ్‌బ్యాంకు తెరిచినప్పుడు సిబ్బంది అవసరం కాబట్టి చెల్లిస్తున్నాం. 
– జీవైఎన్‌ బాబు, 
రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా సెక్రటరీ
మరిన్ని వార్తలు