ఆ ‘ఇద్దరే’ టార్గెట్‌ .!

7 Jun, 2017 22:56 IST|Sakshi
ఆ ‘ఇద్దరే’ టార్గెట్‌ .!

ఎర్రచందనం అక్రమ రవాణాలో ఇక మిగిలింది అంతర్జాతీయ ప్రధాన స్మగ్లర్‌    ‘సాహుల్‌’ ‘ఏటీఎం’లే  
దుబాయ్‌లో కింగ్‌మేకర్‌గా ‘సాహుల్‌’
9 నెలల్లో  26 మందిపై పీడీ యాక్ట్‌ నమోదు  
వీరంతా ‘ సాహుల్‌’ అనుచరులే...!


కడప అర్బన్‌: అంతర్జాతీయ స్థాయిలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ సామ్రాజ్యాన్ని శాసిస్తున్న వారిలో ఇక మిగిలింది ఇద్దరే.. ఆ ఇద్దరు చెన్నైకి చెందిన సాహుల్‌ భాయ్‌ ఒకరు, పాండిచ్చేరికి చెందిన అహ్మద్‌ తయ్యుబ్‌ మొహిద్దీన్‌ అలియాస్‌ ఏటీఎం మరొకరు. వీరిద్దరి పేర్లు ప్రస్తుతం పోలీసుల రికార్డుల్లో ఉన్నట్లు సమాచారం. వీరిని అరెస్ట్‌ చేయగలిగితే అంతర్జాతీయ స్థాయిలో ఎర్ర చందనం అక్రమ రవాణా ప్రక్రియను పూర్తిగా కూకటి వేళ్లతో పెకలించినట్లవుతుందని పలువురు భావిస్తున్నారు. జిల్లా ఎస్పీగా పీహెచ్‌డీ రామకృష్ణ బాధ్యతలు చేపట్టిన తర్వాత గత ఏడాది ఆగస్టు నుంచి 26 మందిపై పీడీ యాక్ట్‌లను ప్రయోగించారు. వీరంతా సాహుల్‌ భాయ్‌ అనుచరులేనని పోలీసులు తమ విచారణలో తేల్చినట్లు సమాచారం.

ఎర్రదుంగల అక్రమ రవాణాలో చురుగ్గా  ‘ఏటీఎం’  
జిల్లా నుంచి ఎర్రచందనం అక్రమ రవాణాను చెన్నై, కోల్‌కత్తాల నుంచి దుబాయ్, ఇతర దేశాలకు చాకచక్యంగా చేయడంలో ఏటీఎం నేర్పరి. పాండిచ్చేరిలో తనకున్న రిసార్ట్స్‌కు వచ్చి వెళుతుంటాడని సమాచారం. సాహుల్‌కు ఎర్రచందనం అక్రమ రవాణాలో సహకరించడంలో ఏటీఎందే ‘కీలక పాత్ర’.

9 నెలల్లోనే 26 మందిపై పీడీ యాక్ట్‌ల ప్రయోగం: వీరంతా సాహుల్‌ అనుచరులే..!
వైఎస్‌ఆర్‌ జిల్లా పోలీసు యంత్రాంగం జిల్లా ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ పర్యవేక్షణలో టాస్క్‌ఫోర్స్, వివిధ పోలీస్‌ స్టేషన్‌ల అధికారులు, సిబ్బంది గత ఏడాది ఆగస్టు నుంచి ఇప్పటి వరకు 26 మందిపై పీడీ యాక్ట్‌లను ప్రయోగించి కడప కేంద్ర కారాగారంలో ఉంచారు. వీరిలో ప్రధానంగా పార్తిబన్, సుబ్రమణ్యం అలియాస్‌ సింగపూర్‌ సుబ్రమణ్యం, జాకీర్, ఫయాజ్‌ అహ్మద్‌ అలియాస్‌ ఫయాజ్‌లతో పాటు ఉన్నవారంతా సాహుల్‌ భాయ్‌ అనుచరులేనని పోలీసుల విచారణలో తేలినట్లు తెలుస్తోంది.

టాస్క్‌ఫోర్స్‌ టార్గెట్‌లో ‘ఏటీఎం’, సాహుల్‌’..
జిల్లా పోలీసు యంత్రాంగం ఏటీఎం, సాహుల్‌లను అరెస్ట్‌ చేయగలిగితే ఎర్రచందనం అక్రమ రవాణాను కూడా పూర్తిగా నిర్మూలించినట్లేనని అనుకుంటున్నారు. ఇందుకోసం పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వారి కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం ముమ్మరంగా చేస్తున్నారు. నిఘా పెంచి వారిని త్వరగా అరెస్ట్‌ చేస్తే ఎర్రచందనం స్మగ్లింగ్‌ సామ్రాజ్యాన్ని కుప్పకూల్చినట్లే అవుతుందనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.

దుబాయ్‌లో కింగ్‌ మేకర్‌గా‘సాహుల్‌ భాయ్‌’
ఎర్రచందనం స్మగ్లింగ్‌ సామ్రాజ్యాన్ని అంతర్జాతీయ స్థాయిలో విస్తరింపజేసేందుకు ‘సాహుల్‌ భాయ్‌’ దుబాయ్‌ని స్థావరంగా చేసుకున్నాడు. అక్కడ లైసెన్స్‌డ్‌ ఫర్నీచర్‌ షాపును నడుపుతూ తాను సంపాదించిన అక్రమార్జన ద్వారా అక్కడ కింగ్‌ మేకర్‌గా పేరు తెచ్చుకున్నాడు. తన ప్రధాన అనుచరుడు  ఏటీఎం ద్వారా అనేక దేశాలకు సముద్ర మార్గంలో ఎర్రచందనం దుంగలను రవాణా చేస్తూ, వ్యాపారాన్ని యథేచ్ఛగా నిర్వహిస్తున్నాడు. వీరిద్దరూ పోలీసులకు చిక్కితే 100 శాతం ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టినట్లవుతుందని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి.

మరిన్ని వార్తలు