గంగన్నా.. నోరు అదుపులో పెట్టుకో

10 Jun, 2017 23:29 IST|Sakshi
గంగన్నా.. నోరు అదుపులో పెట్టుకో

- ఏపీ రెడ్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన
పుట్టపర్తి టౌన్‌ : రెడ్డి సామాజిక వర్గం అధికారులను లక్ష్యంగా చేసుకుని టీడీపీ నేత, పుట్టపర్తి నగర పంచాయతీ చైర్మన్‌ పి.సి.గంగన్న దుర్బాషలాడడం సిగ్గు చేటని, నోరు అదుపులో పెట్టుకోకపోతే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఏపీ రెడ్ల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గంగులకుంట నరేష్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా సత్యసాయి ఎయిర్‌పోర్ట్‌ వద్ద పోలీసులపై పి.సి.గంగన్న అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా శనివారం ఏపీ రెడ్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.ఎనుములపల్లి గణేష్‌ సర్కిల్‌ నుంచి ర్యాలీగా వెళ్లి పుట్టపర్తి పట్టణ పోలీస్‌స్టేషన్‌ ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా నరేష్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ పుట్టపర్తికి ప్రథమ పౌరుడిగా ఉన్న గంగన్న తన స్థాయిని మరచి బజారు మనిషిలా అధికారులు, రెడ్డి సామాజిక వర్గాన్ని కించపరిచేలా ప్రవర్తించడం హేయమన్నారు. అధికారం ఉంది కదా అని ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదన్నారు. ఆయన వ్యాఖ్యలను బీసీ వర్గాలే తప్పు పడుతున్నాయన్నారు.స్పందించిన సీఐలు బాలసుబ్రహ్మణ్యంరెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ విధుల్లో ఉన్న ఎస్‌ఐ ఫిర్యాదు మేరకు  గంగన్నపై కేసు నమోదు చేశామన్నారు. ఒకటి, రెండు రోజుల్లో అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలిస్తామన్నారు.

కార్యక్రమంలో సంఘం నేతలు బీడుపల్లి మాధవరెడ్డి, కౌన్సిలర్‌ నారాయణరెడ్డి, జిల్లా అధ్యక్షుడు కమటం శేషారెడ్డి, పుట్టపర్తి మండల నాయకులు బాబుల్‌రెడ్డి, సాయిరాంరెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, హనుమంతరెడ్డి, భాస్కర్‌రెడ్డి, రమణారెడ్డి, ఆదినారాయణరెడ్డి, మురశీకృష్ణారెడ్డి, తిప్పారెడ్డి, రఘునాథరెడ్డి, నాగిరెడ్డి, క్రిష్ణారెడ్డి, హిందూపురం ధర్మవరం, పరిగి, గోరంట్ల  తదితర మండలాలకు చెందిన రెడ్డి సామాజిక వర్గం యువకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు