రాష్ట్రానికి తగ్గిన ప్రాతినిధ్యం

13 Feb, 2017 22:28 IST|Sakshi
రాష్ట్రానికి తగ్గిన ప్రాతినిధ్యం

సాక్షి, అమరావతి బ్యూరో : జాతీయ మహిళా పార్లమెంటు సదస్సు ద్వారా నవ్యాంధ్రప్రదేశ్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను పెంచుకోవాలని ఆరాటపడ్డ రాష్ట్ర ప్రభుత్వానికి స్వరాష్ట్రం నుంచే విమర్శలు వెల్లువెత్తాయి. ఎంతో ఆర్భాటంగా నిర్వహించిన మహిళా పార్లమెంటు సదస్సుకు సొంత రాష్ట్రానికి చెందిన ప్రముఖులను ఆహ్వానించక పోవడంపై చాలామంది పెదవి విరిచారు. పైగా రాజకీయ ప్రముఖులు కానివారికి  సదస్సులో పెద్దపీట వేయడాన్ని తప్పుబట్టారు. దేశ, విదేశాల నుంచి ప్రముఖులు, విద్యార్థినులు వస్తున్న నేపథ్యంలో వారికి సౌకర్యాల కల్పనలో అధికార యంత్రాంగం విఫలమైందని ఎండగట్టారు.

ముఖ్యంగా రెండో రోజు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రోజాను సదస్సుకు ఆహ్వానించి.. అవమానించిన తీరుపై  పలువురు వక్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా సాధికారత గురించి గొప్పగా చెప్పుకుంటున్న వేళ ఓ మహిళా ఎమ్మెల్యే పట్ల పోలీసులు వ్యవహరించిన విధానంపై మండిపడ్డారు. రోజాను సదస్సుకు ఆహ్వానించి మాట్లాడించి ఉంటే సబబుగా ఉండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

రాష్ట్రానికి ప్రాతినిధ్యం ఏదీ?
ఎందరో ధీరవనితలు ఉన్న మన రాష్ట్రానికి మాత్రం మహిళా పార్లమెంటు సదస్సులో ఆశించిన స్థాయిలో ప్రాతినిధ్యం లభించలేదు. మూడు రోజులపాటు అట్టహాసంగా నిర్వహించిన సదస్సుకు దేశ, విదేశాలకు చెందిన ఎందరో ప్రముఖులను ఆహ్వానించారు. మన రాష్ట్రానికి చెందిన కొందరికి మాత్రమే ఆహ్వానాలు పంపటం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌లో పలు రంగాల్లో  మహిళలు రాణిస్తున్నారు. అయినా వారికెవరికి ఆహ్వానం లభించలేదు. మహిళా సాధికారత కోసం పోరాటం చేస్తున్న వారిని సైతం ప్రభుత్వం విస్మరించడంపై విమర్శలు వినిపించాయి.

కొందరికే మాట్లాడే అవకాశం!
మన రాష్ట్రంలో నిర్వహిస్తున్న మహిళా పార్లమెంటు సదస్సులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొందరికే మాట్లాడే అవకాశం కల్పించడంపైనా మహిళల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. కొందరిని మాత్రమే మాట్లాడించేందుకు అవకాశం ఇవ్వడం శోచనీయమని సదస్సుకు హాజరైన వారు విచారం వ్యక్తం చేశారు. కేవలం మంత్రులు పరిటాల సునీత, పీతల సుజాత, మృణాళిని, ఎమ్మెల్యేలు అఖిలప్రియ, అనిత, మహిళా కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి, ఎంపీలు బుట్టా రేణుక, కొత్తపల్లి గీతలు మినహాయిస్తే మరెవ్వరికీ మాట్లాడే అవకాశం రాకపోవడం గమనార్హం.

రోజాకు అవకాశం ఇవ్వాల్సింది..
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోడలు నారా బ్రాహ్మణి, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కుమార్తె దీపా వెంకట్, స్పీకర్‌ కోడెల కుమార్తె విజయలక్ష్మిలకు ప్రభుత్వం సదస్సులో పెద్దపీట వేసింది. ఎమ్మెల్యే రోజాకు సదస్సుకు రమ్మని ఆహ్వానం పంపిన తర్వాత ఆమె రాకను అడ్డుకుని హడావుడిగా హైదరాబాద్‌కు తరలించడాన్ని పలువురు మహిళలు ఖండించారు. పోలీసులు, ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎమ్మెల్యే రోజా విషయంలో వివక్ష చూపిన తీరుపై ఆదివారం మహిళా పార్లమెంటు సదస్సులో పలువురు చర్చించుకోవడం కనిపించింది. రోజాకు మాట్లాడే అవకాశం ఇచ్చి ఉంటే సబబుగా ఉండేదన్న అభిప్రాయం వారిలో వ్యక్తమైంది.

ఏర్పాట్లలో వైఫల్యం..
జాతీయ మహిళా పార్లమెంటు సదస్సు ఏర్పాట్ల విషయంలో సర్కారు ఘోరంగా విఫలమైందని విమర్శలు వినిపించాయి. తొలిరోజు, రెండోరోజు తాగునీటి, మరుగుదొడ్ల సమస్యలు మహిళల్ని వెంటాడాయి. భోజన ఏర్పాట్లు సరిగా లేకపోవడంతో చాలా మంది సందర్శకులు భోజనాలు తినకుండానే వెనుదిరిగి వెళ్లడం కనిపించింది. ఇక సదస్సుకు జాతీయ స్థాయిలో ప్రచారం ఇప్పించుకోవాలని భావించిన ప్రభుత్వానికి సాంకేతిక సమస్యలు చుట్టుముట్టాయి. ఫలితంగా వివిధ చానెళ్లు, మీడియా ప్రతినిధులు ఇక్కట్లు పడ్డారు. ఈ సమస్య చివరి రోజు వరకు కొనసాగినా అధికారులు పరిష్కరించలేకపోవడం గమనార్హం.

మరిన్ని వార్తలు