పోతిరెడ్డిపాడుకు నీటి విడుదల తగ్గింపు

22 Jan, 2017 00:25 IST|Sakshi
శ్రీశైలం ప్రాజెక్టు: పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ ద్వారా విడుదల చేసే నీటిపరిమాణాన్ని అధికారులు తగ్గించారు. శుక్రవారం నీటివిడుదల 800 క్యూసెక్కులు ఉండగా, శనివారం 600 క్యూసెక్కులను విడుదల చేశారు. గత నాలుగు రోజుల క్రితం నుంచి ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకానికి నీటివిడుదలను నిలిపివేసిన విషయం తెలిసిందే. హంద్రీనివా సుజలస్రవంతికి విడుదల చేసే 2,025 క్యూసెక్కుల నీటిని యథావిథిగా కొనసాగిస్తున్నారు. శ్రీశైలంకుడి, ఎడమగట్టు జలవిద్యుత్‌ కేంద్రాల్లో  ఉత్పాదన కొనసాగుతుంది. శుక్రవారం నుంచి శనివారం వరకు కుడిగట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో 1.444 మిలియన్‌ యూనిట్లు, ఎడమగట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో 5.842 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. ఉత్పాదన అనంతరం 14,694 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయంలో 91.6176 టీఎంసీల నీరు నిల్వ  ఉంది. డ్యాం నీటిమట్టం 854.90 అడుగులు నమోదైంది. 
 
మరిన్ని వార్తలు