పాలనపై రెఫరెండమే

3 Nov, 2015 02:14 IST|Sakshi
పాలనపై రెఫరెండమే

సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ 16 నెలల పాలనపై వరంగల్ ఉప ఎన్నిక రెఫరెండం అని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టంచేశారు. సోమవారం గాంధీభవన్‌లో టీపీసీసీ ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఉత్తమ్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ఏఐసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొప్పుల రాజు, మాజీ కేంద్ర మంత్రి  జైపాల్‌రెడ్డి, ముఖ్య నేతలు కె.జానారెడ్డి, షబ్బీర్ అలీ, మల్లు భట్టి విక్రమార్కతోపాటు 100 మంది ఏఐసీసీ, టీపీసీసీ నేతలు పాల్గొన్నారు. ఉప ఎన్నిక జరగనున్న వరంగల్ లోక్‌సభ నియోజకవర్గంలో ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌కు ఒక ముఖ్య నేతను ఇన్‌చార్జిగా నియమించడంతోపాటు ప్రచార వ్యూహాన్ని ఈ భేటీలో ఖరారు చేశారు.

ఎన్నికల ప్రచారానికి ఏఐసీసీ నేతలను కూడా ఆహ్వానించనున్నారు. ఈ నెల 4న అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో పాదయాత్ర, నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం జరపాలని నిర్ణయించారు. 6, 7 తేదీల్లో ప్రతి పార్టీ కార్యకర్త ఇంటిపై కాంగ్రెస్ జెండాను ఎగుర వేసి జెండా పండుగ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 8 నుంచి 14 వరకు ఇంటింటి ప్రచారం చేయనున్నారు. 15-19 తేదీల్లో నియోజకవర్గ కేంద్రాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. 19న వరంగల్ కేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. దీనికి సోనియాగాంధీ లేదా రాహుల్‌గాంధీని ఆహ్వానించాలనే యోచనలో టీపీసీసీ ఉంది.

 విద్వేషాల్లేకుండా పనిచేద్దాం
 కాంగ్రెస్ పార్టీ నేతలు పరస్పరం కలహించుకోవడం, అది పెద్ద ఎత్తున ప్రచారం కావడం వల్ల ప్రత్యర్థి పార్టీలకు అవకాశం ఇచ్చినట్టవుతుందని పలువురు నేతలు ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఇది ప్రత్యర్థి పార్టీలకు అవకాశం ఇవ్వడంతో పాటు ప్రజల్లోనూ, పార్టీ శ్రేణుల్లోనూ అపనమ్మకం ఏర్పడుతుందని పలువురు సీనియర్లు అన్నారు. వ్యక్తిగత విభేదాలు, అధిపత్య ధోరణులు విడనాడి ఐక్యంగా పనిచేస్తే టీఆర్‌ఎన్‌ను మట్టి కరిపించడం అసాధ్యం కాదని వారన్నారు. పరస్పర విద్వేషాలు లేకుండా, ఐక్యంగా పనిచేద్దామని చెప్పారు.

 హామీలపై ఇంటింటి ప్రచారం: ఉత్తమ్
 వరంగల్ ఉప ఎన్నిక ఫలితాలను టీఆర్‌ఎస్ పాలనపై రెఫరెండం అని మంత్రులు చేసిన సవాల్‌ను స్వీకరిస్తున్నామని ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేయడంపై ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తామన్నారు. తెలంగాణ ఇస్తామని చెప్పి మాట నిలుపుకున్న కాంగ్రెస్‌కు, ఎన్నికల్లో హామీలిచ్చి మోసం చేసిన టీఆర్‌ఎస్ మధ్య ఈ ఉప ఎన్నికలు జరుగుతున్నాయన్నారు.

 కేసీఆర్ తప్పుకో: భట్టి
 కేంద్ర కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అవినీతిపై సీబీఐ విచారణ జరుగుతున్నందున ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ పదవి నుంచి తప్పుకోవాలని, సీబీఐ విచారణ నిష్పక్షపాతంగా జరగడానికి సహకరించాలని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్రమంత్రిగా చేసిన తప్పులపై విచారణ జరుగుతోందంటూ జరుగుతున్న ప్రచారంపై కేసీఆర్ స్పష్టత ఇవ్వాలన్నారు.
 
 ఇన్‌చార్జ్‌లు వీరే
 వరంగల్ ఉప ఎన్నికల్లోని అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ ముఖ్యులను ఇన్‌చార్జులుగా నియమించారు. వరంగల్ పశ్చిమ- ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వరంగల్ తూర్పు- షబ్బీర్ అలీ, భూపాలపల్లి- కె.జానారెడ్డి, స్టేషన్ ఘన్‌పూర్ - పొన్నాల లక్ష్మయ్య, వర్ధన్నపేట - మల్లు భట్టి విక్రమార్క, పరకాల-టి.జీవన్‌రెడ్డిలను ఖరారు చేశారు. పాలకుర్తి నియోజకవర్గానికి ఇన్‌చార్జిని ఇంకా ఖరారు చేయలేదు.

మరిన్ని వార్తలు