ఆర్టీసీలో సంస్కరణలు

29 Dec, 2016 01:52 IST|Sakshi
ఆర్టీసీలో సంస్కరణలు
ఏలూరు (ఆర్‌ఆర్‌ పేట) : రాష్ట్ర ప్రజల రవాణా అవసరాలను గుర్తించి అందుకు అనుగుణంగా ఆర్టీసీలో సంస్కరణ తీసుకురావడానికి కార్యాచరణ రూపొం దిస్తున్నామని ఆర్టీసీ ఎండీ ఎం.మాలకొండయ్య తెలిపారు. ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా జిల్లాలోని ఏలూరు ఆర్టీసీ డిపో, గ్యారేజ్, ఏలూరు కొత్త బస్టాండుల్లో ఆయన క్షేత్ర పరిశీలన చేశారు. ఆర్టీసీ ఇప్పటికే కోట్లాది రూపాయల నష్టాల్లో నడుస్తోందని, అప్పులకు వడ్డీల కింద రూ.240 కోట్లు చెల్లిస్తున్నామన్నారు. సంస్థను రక్షించుకోవాల్సిన బాధ్యత కార్మికులపై ఉందని చెప్పారు.
టికెట్ల ద్వారా 85 శాతం ఆదాయం
సంస్థకు టికెట్ల ద్వారానే అత్యధికంగా 85 శాతం ఆదాయం వస్తోందని, ఇతర మార్గాల ద్వారా ఆదాయ వనరులను పెంచుకోవడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని ఎండీ మాలకొండయ్య చెప్పారు. రవాణా ఆదాయాన్ని మరో 2 శాతమన్నా పెంచగలిగితే సంస్థకు రూ.200 కోట్ల ఆదాయం అదనంగా లభిస్తుందన్నారు. పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన ఇబ్బందులను అధిగమించడానికి ఆర్టీసీలో కూడా త్వరలో ప్రయోగాత్మకంగా స్వైపింగ్‌ యంత్రాలను అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆర్టీసీ ఆదాయానికి గండి కొడుతున్న అక్రమ రవాణాను నియంత్రించాలని పోలీస్, రవాణా శాఖాధికారులను కోరామన్నారు. 
బీవోటీ పద్ధతిపై స్థలాల లీజు
జిల్లాలో ఆర్టీసీకి తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సుల ద్వారా నష్టం వస్తోందని, వాటిని నియంత్రించే అవకాశంపై ఆయనను ప్రశ్నించగా ఏ రీజియన్‌కు ఆదాయం వచ్చినా మొత్తం సంస్థకే వస్తుంది కాబట్టి వాటిని నియంత్రించడానికి అవకాశం లేదన్నారు. బిల్డ్, ఆపరేట్, ట్రాన్‌సఫర్‌ (బీవోటీ ) పద్ధతిపై ఆర్టీసీ స్థలాలను అద్దెలకు ఇచ్చి ఆదాయం పెంచుకోవడానికి చర్యలు తీసుకుంటున్నామని, ఏలూరు కొత్త బస్టాండ్‌ ప్రాంగణంలోని అతిపెద్ద స్థలాన్ని సీఎంఆర్‌ సంస్థకు బీవోటీ పద్ధతిన లీజుకు ఇచ్చామని తెలిపారు.
బైపాస్‌ బస్సులపై అధ్యయనం
బైపాస్‌ బస్సులు నగరంలోకి రాకపోవడం వల్ల ఏలూరు ప్రజలు చాలా కాలంగా సమస్యలు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా రాత్రి 11 గంటల తర్వాత బైపాస్‌ బస్సుల్లో వచ్చే ప్రయాణికులు ఆశ్రం కళాశాల వద్ద దిగి నగరంలోకి రావడానికి ఆటోలు దొరక్క పడుతున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసురాగా బైపాస్‌ బస్సులను రాత్రి 11 గంటల నుంచి వేకువజామున 4 గంటల వరకూ నగరంలోకి వచ్చేట్లు చేయడానికి గల అవకాశాలపై అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. 
ఆర్టీసీ కార్మిక సంఘం నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ రాష్ట్ర నాయకుడు ఆర్‌వీవీఎస్‌డీ ప్రసాదరావు మాట్లాడుతూ ఆర్టీసీకి ప్రైవేట్‌ అక్రమ వాహనాల కారణంగా ఏటా రూ.200 కోట్ల మేర నష్టం వాటిల్లుతోందని, అలాగే ఆర్టీసీ బస్సులకు వినియోగించే డీజిల్‌ ఆయిల్‌పై 14 శాతం పన్ను వసూలు చేస్తుండటంతో మరో రూ.200 కోట్లు సంస్థకు భారంగా పరిణమించిందని చెప్పారు. ఆర్టీసీ ఈడీ అడ్మినిస్ట్రేషన్‌ కె.వెంకటేశ్వరరావు, ఈడీ ఆపరేషన్‌స జి.జయరావు, విజయవాడ జోన్‌ ఈడీ ఎన్‌.వెంకటేశ్వరరావు, చీఫ్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ బ్రహ్మానందరెడ్డి, రీజినల్‌ మేనేజర్‌ ఎస్‌.ధనుంజయరావు, డెప్యూటీ చీఫ్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ ఎస్‌.మురళీకృష్ణ, డెప్యూటీ చీఫ్‌ మెకానికల్‌ ఇంజినీర్‌ ఎం.నాగేశ్వరరావు పాల్గొన్నారు.
 
జిల్లాలో ప్రయోగాత్మకంగా నగదురహితం
ఏలూరు (మెట్రో): జిల్లాలో నాలుగు ఆర్టీసీ బస్సుల్లో ప్రయోగాత్మకంగా నగదు రహిత చెల్లింపులకు వీలుగా ఆన్‌లైన్‌ విధానాన్ని అమలు చేయనున్నట్లు ఆర్టీసీ ఎండీ ఎం.మాలకొండయ్య చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లో బుధవారం కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ను మాలకొండయ్య మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ప్రతి బస్సులోనూ క్యూ ఆర్‌ కోడ్‌ను ఏర్పాటు చేస్తామని, కేవలం సాధారణ ఫోన్‌ ద్వారా కండక్టర్‌ ప్రజల నుంచి నగదురహిత విధానం ద్వారా ప్రయాణికులకు టికెట్లు అందించే ప్రక్రియను సులువుగా అమలు చేయవచ్చన్నారు. ఆర్టీసీ ఈడీఏ వెంకటటేశ్వరరావు, ఆపరేషన్‌స ఈడీ జయరావు, సీడీఎం బ్రహ్మానందరెడ్డి, ఆర్టీసీ ఆర్‌ఎం ధనుంజయరావు పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు