సర్వర్‌ డౌన్‌

9 Jun, 2017 22:54 IST|Sakshi
సర్వర్‌ డౌన్‌

– జిల్లా వ్యాప్తంగా ఆగిన రిజిస్ట్రేషన్లు
– రెండ్రోజులుగా వెలవెలబోతున్న కార్యాలయాలు
– 13వ తేదీ వరకు ఇదే పరిస్థితి !


అనంతపురం టౌన్‌ : ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం తెచ్చిపెట్టే రిజిస్ట్రేషన్‌ శాఖ రెండ్రోజులుగా మూగబోయింది. సర్వర్‌ లోపాల కారణంగా గురువారం నుంచి భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. శుక్రవారమైనా కష్టాలు తొలుగుతాయనుకుంటే సాయంత్రం వరకు వేచి చూసినా ఫలితం లేకపోయింది. దీంతో స్థలాలు, భూములు, భవనాల కొనుగోలుదారులు, అమ్మకందారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జిల్లాలో అనంతపురం, హిందూపురం రిజిస్ట్రేషన్‌ జిల్లాల పరిధిలో 21 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉన్నాయి. రాష్ట్ర స్థాయిలోనే సర్వర్‌ పని చేయకపోవడంతో అన్ని రకాల సేవలు స్తంభించిపోయాయి. ఎన్‌ఐసీతో అనుసంధానమైన రిజిస్ట్రేషన్‌ శాఖ సర్వర్‌ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాలంటే మరో ఐదు రోజులు పట్టే అవకాశం ఉందని ఆ శాఖ వర్గాలు తెలిపాయి.

సాఫ్ట్‌వేర్‌లో చేస్తున్న మార్పు కారణంగానే ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. జిల్లాలోని అన్ని కార్యాలయాల  నుంచి రోజూ సుమారు రూ.4 కోట్ల ఆదాయం వచ్చేది. రెండ్రోజులుగా  ఒక్క రిజిస్ట్రేషన్‌ కూడా చేయలేదు. ఉదయాన్నే విధులకు హాజరవుతున్న అధికారులు సాయంత్రం వరకు వేచి ఉండి వెళ్లిపోతున్నారు. సర్వర్‌ విషయం తెలియక కొందరు క్రయవిక్రయదారులు కార్యాలయాలకు వస్తుండగా.. మరికొందరు డాక్యుమెంట్‌ రైటర్లు, సిబ్బందికి ఫోన్‌ చేసి ఆరా తీస్తున్నారు. ఇటీవల స్తిరాస్థి రిజిస్ట్రేషన్లకు సంబంధించి ‘ఆధార్‌’ అనుసంధానం తెగిపోవడంతో రిజిస్ట్రేషన్లు తగ్గుముఖం పట్టాయి.

యూఐడీఏఐ (యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా) అధికారులు రిజిస్ట్రేషన్‌ శాఖకు ఆధార్‌ సర్వర్‌ అనుసంధానాన్ని ఆపేయడంతో అప్పట్లో సమస్య వచ్చింది. ఆధార్‌లో ఏమైనా తప్పులు ఉంటే సవరించడానికి అవసరమైన ఈకేవైసీ (ఎలక్ట్రానిక్‌ నో యువర్‌ కస్టమర్‌) సర్వర్‌ను సైతం ఆపేయడంతో ఆదాయం తగ్గుముఖం పట్టింది. తాజాగా మరోసారి సర్వర్‌ డౌన్‌ కావడంతో క్రయ విక్రయదారులకు కష్టాలు తప్పడం లేదు. ఇప్పటికే అడ్వాన్సులు తీసుకున్న వారు ఆందోళన చెందుతున్నారు. కాగా.. రిజిస్ట్రేషన్లలో సాంకేతిక లోపాలు తలెత్తినప్పుడు ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యతను ఆ శాఖ అధికారులు విస్మరిస్తున్నారు. ఫలితంగా పనుల కోసం వచ్చే వారు ఇబ్బంది పడాల్సి వస్తోంది.

మరిన్ని వార్తలు