విడిపోతున్న బంధం!

25 Aug, 2016 23:42 IST|Sakshi
వీణవంక : జిల్లాల పునర్విభజనలో భాగంగా హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని వీణవంక మండలం మాత్రమే ఇక కరీంనగర్‌ జిల్లాలోనే కొనసాగనుంది. కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉన్న జమ్మికుంట మండలంతో పాటు హుజూరాబాద్, కమలాపూర్‌ మండలాలు కొత్తగా ఏర్పడనున్న హన్మకొండ జిల్లాలోకి చేరనున్నాయి. వీణవంక–జమ్మికుంట మండలాల మధ్య 30 ఏళ్ల అనుబంధం కొనసాగింది. విద్య, వ్యాపార రంగాలతో పాటు, బస్సు, రైల్వే సౌకర్యం, బ్యాంకు లావాదేవీలు జమ్మికుంటలో ఉండడంతో వీణవంక మండల ప్రజలు సుమారు 90 శాతం వరకు నిత్యం అక్కడికే వెళుతుంటారు. వీణవంక–కరీంనగర్‌ మధ్య 30 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ క్రమంలో సమీపంలో ఉన్న జమ్మికుంటనే ఈ ప్రాంతవాసులకు పెద్ద దిక్కుగా ఉండేది. పునర్విభజనలో భాగంగా జమ్మికుంటను హన్మకొండలో కలపడం ప్రస్తుతం ఇబ్బందిగా మారనుందని మండల ప్రజల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీణవంక మండలంలో 20గ్రామ పంచాయతీలు, ఐదు అనుబంధ గ్రామాలున్నాయి. 48వేల జనాభా ఉండగా 18వేల కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ ఎక్కవగా వ్యవసాయం మీద ఆధారపడుతారు. ఎస్సారెస్పీ కెనాల్‌ కాలువలు దాదాపు అన్ని గ్రామాలకు విస్తరించి ఉండటంతో వరి పంటపైనే ఎక్కవగా మొగ్గు చూపుతారు. ఇక్కడ పండించిన ధాన్యాన్ని జమ్మికుంటకే తరలిస్తుంటారు. చల్లూరు, మామిడాలపల్లి, ఎల్భాక, గంగారం గ్రామాల ప్రజలు మాత్రమే వ్యాపార నిమిత్తం కరీంనగర్‌కు వెళుతుంటారు. ఇటీవల జరిగిన సమావేశంలో అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులు కరీంనగర్‌ జిల్లాలోనే కొనసాగించాలని తీర్మాణం చేశారు. అయితే జమ్మికుంట కూడా వీణవంకతోనే ఉంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 
తెరపైకి ‘బేతిగల్‌’ 
మండలంలోని బేతిగల్‌ గ్రామాన్ని జమ్మికుంటలో కలపాలనే ప్రతిపాదనను ఆ గ్రామ ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు గురువారం గ్రామ సభ నిర్వహించగా ఎక్కవ మంది జమ్మికుంట మండలంలో కలుపాలని ప్రతిపాదించారు. బేతిగల్‌కు కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో జమ్మికుంట ఉంది. అదే కరీంనగర్‌కు వెళ్లాలంటే 40 కిలోమీటర్ల ప్రయాణం తప్పనిసరి. ఈ మేరకు గ్రామం నుంచి 120 మంది వరకు జమ్మికుంటలో కలుపాలని వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేశారు. అయితే దాదాపుగా వీణవంకతో జమ్మికుంటకు ఉన్న అనుబంధానికి త్వరలో తెరపడనున్నట్లు తెలిసింది.
 
 
మరిన్ని వార్తలు