పసుపు దొంగల్ని వదిలేసి వీఆర్వోలపై చర్యలా!

3 Aug, 2017 00:57 IST|Sakshi
పసుపు దొంగల్ని వదిలేసి వీఆర్వోలపై చర్యలా!

మార్క్‌ఫెడ్‌ కుంభకోణం వ్యవహారంలో కలెక్టర్‌ తీరుపై కాకాణి ఆక్షేపణ
ఉదయగిరి ఎమ్మెల్యే రూ.కోట్లు   కొల్లగొట్టారని మేకపాటి ఆరోపణ
బెట్టింగ్‌ వ్యవహారంలో టీడీపీ నేతల్ని వదిలేశారన్న ప్రతాప్‌కుమార్‌రెడ్డి


కావలి : ఉదయగిరి నియోకవర్గంలో వెలుగుచూసిన పసుపు కుంభకోణంలో అసలు దొంగలను వదిలేసి.. 19 మంది వీఆర్వోలను బలి పశువుల్ని చేయడం శోచనీయమని వైఎస్సా ర్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌ రెడ్డి ధ్వజమెత్తారు. కావలిలోని పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ నాయకుల ఒత్తిళ్లకు కలెక్టర్‌ ఆర్‌.ముత్యాలరాజు తలొగ్గారని.. ఆయన బలహీనంగా వ్యవహరిస్తే జిల్లాలో పాలక వ్యవస్థ నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పసుపు కుంభకోణంలో జిల్లా కలెక్టర్‌ పక్షపాత వైఖరి అవలంబిస్తూ కేసును నీరుగార్చేలా వ్యవహరిస్తున్నారన్నారు. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసిన టీడీపీ నేతలను రక్షించేందుకు యత్నించడం సిగ్గుచేటన్నారు. ఈ కుంభకోణంలో నిష్పక్షపాతంగా, లోతుగా  దర్యాప్తు చేసి, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

మార్క్‌ఫెడ్‌కు నాసిరకం పసుపుతోపాటు మట్టిని సైతం అంటగట్టి నిధులు లూటీ చేసింది ఎవరో తేలిపోయిందన్నారు. ఈ కుంభకోణంతో ప్రత్యక్ష సంబంధం ఉన్న అధికార పార్టీకి చెందిన మార్కెట్‌ కమిటీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మండల పరిషత్‌ అధ్యక్షులు, సర్పంచ్‌లను విస్మరించారన్నారు. టీడీపీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గిన కలెక్టర్‌ 19మంది వీఆర్వోలను సస్పెండ్‌ చేశారని.. అసలు దోషులైన టీడీపీ నాయకులు వదిలేయడం అన్యాయమని పేర్కొన్నారు. అక్రమార్కులు కొల్లగొట్టిన ప్రభుత్వ సొమ్మును ఆర్‌ ఆర్‌ యాక్ట్‌ ప్రకా రం రికవరీ చేసేందుకు కలెక్టర్‌ ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. వైఎస్సార్‌ సీపీ సర్పంచ్‌ల చెక్‌ పవర్‌ రద్దు చేయడం, టీడీపీ సర్పంచ్‌ల అవకతవకలను నివేదిక రూపంలో తెలియజేసిన కార్యదర్శులను సస్పెండ్‌ చేయడం కలెక్టర్‌కు తగదన్నారు. నీరు–చెట్టు పథకం నిధులను పక్కదారి పట్టించిన వ్యవహారంలో అధికారులపై చర్యలు తీసుకున్న కలెక్టర్‌ ఇందుకు కారణమైన టీడీపీ నేతలను గాలికొదిలేయడం శోచనీయమన్నారు.

బెట్టింగ్‌ల పాపం టీడీపీదే
జిల్లాలో క్రికెట్‌ బెట్టింగ్‌ వ్యవహారాలకు బీజం వేసింది టీడీపీ నేతలేనని కాకాణి విమర్శించారు. వారికి నచ్చిన పోలీసు అధికారులకు వివిధచోట్ల పోస్టింగ్‌లు వేయించుకుని.. అక్రమాలను పెంచి పోషించింది వారేనన్నారు. క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వాహకుల నుంచి మామూళ్లు వసూలు చేసిన కొందరు పోలీసులు, వారికి పోస్టింగ్‌ ఇప్పించిన టీడీపీ నేతలకు అందులో వాటాలు ఇచ్చేవారని అన్నారు. వాస్తవం ఇది కాగా, టీడీపీ నేతలు సిగ్గు లేకుండా బెట్టింగ్‌ వ్యవహారాన్ని తమ పార్టీకి అంటగట్టే విధంగా మాట్లాడటం శోచనీయమన్నారు.

మరిన్ని వార్తలు