హతవిధీ.. ఏమిటీ దుస్థితి

26 Jul, 2016 23:20 IST|Sakshi
  • రోడ్డు ప్రమాదంలో హమాలీ మృతి
  • మృతదేహాన్ని అద్దె ఇంటికి తీసుకొచ్చేందుకు ఒప్పుకోని యజమాని
  • రోడ్డే దిక్కయిన వైనం..
  •  
    కొత్తపల్లి(జమ్మికుంట రూరల్‌) : సొంత ఇల్లు లేని పేదవాడు మరణిస్తే ఎన్ని కష్టాలో.. ఇంటి పెద్దను కోల్పోయి కుటుంబీకులు ఓ వైపు దుక్కిస్తుంటే శవాన్ని ఎక్కడ ఉంచాలో తెలియక బంధువులు సతమతమైన హృదయ విచారకర ఘటన ఇది. చనిపోయినందుకు బాధపడాలో, ఆశ్రయం కోసం వెతకాలో తెలియక ఆ కుటుంబం పడిన వేధన గ్రామస్తులను కలిచి వేసింది. చివరికి ఆ శవానికి రోడ్డే దిక్కయింది. కెనాల్‌ రోడ్డుపై శవాన్ని ఉంచి అంత్యక్రియలు నిర్వహించాల్సిన దుస్థితికి సంబంధించిన వివరాలివి.
    కర్ణాటక రాష్ట్రంలోని శివమోగం జిల్లా శికారిపూర్‌ తాలూకా నలవాల్‌ గ్రామానికి చెందిన హమాలీ కుమార్‌(36) జీవనోపాధి కోసం  20 యేళ్ల క్రితం జమ్మికుంట మండలం కొత్తపల్లి గ్రామానికి వచ్చాడు. ఇక్కడే వివాహం చేసుకున్నాడు. కుమార్‌ స్థానిక కూరగాయల మార్కెట్‌లో 12 యేళ్లుగా హమాలీగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్‌ నుంచి కూరగాయలు తీసుకువచ్చేందుకు ఆదివారం టాటా ఏస్‌లో వెళ్తుండగా యాదగిరిగుట్ట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడిక్కడే మృతి చెందాడు. కుమార్‌ మృతి వార్త విని కుటుంబీకులు కుప్పకూలారు. బంధువులంతా శోక సంద్రంలో మునిగారు. శవ పంచనామా అనంతరం మృత దేహాన్ని కొత్తపల్లికి తీసుకువచ్చారు. అయితే మృతుడిది అద్దె ఇల్లు కావడంతో యజమాని శవాన్ని ఇంటి ముందు ఉంచడానికి నిరాకరించాడు. ఆశ్రయం ఇచ్చేందుకు ఎవరూ ఒప్పుకోకపోవడంతో కొత్తపల్లి శివారు ఎస్సారెస్పీ ఉప కాలువ రహదారిపై టెంట్‌ వేసి శవాన్ని బంధువుల సందర్శనార్థం ఉంచి అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి  భార్య లత, కుమారుడు శివశంకర్, కూతురు చంద్రకళ ఉన్నారు.
    ఇలా ఎందరో...
    సొంత ఇల్లు లేక మృతుల అంత్యక్రియలు, కర్మకాండలు నిర్వహించేందుకు అష్టకష్టాల పాలైన వారి సంఖ్య అధికంగానే ఉంది. గతంలోనూ సొంత గూడు లేని నిరుపేదలు మృతి చెందగా కర్మలను వారి కుటుంబసభ్యులు చెట్లు, గుట్టల్లో నిర్వహించుకొన్న సంఘటనలు కోకొల్లలు. ఇటీవల స్వర్ణ కారుడు అనారోగ్యంతో,  ఓ యువకుడు రైలు కిందపడి మృతి చెందిన ఘటనల్లోనూ శవాన్ని ఎక్కడికి తరలించాలనే తెలియక రోడ్డుపైనే అంత్యక్రియలు పూర్తి చేశారు. మిగతా కర్మలకు పాడుబడ్డ ప్రభుత్వ భవనాలు, ఊరు చివర మైదానాల్లో నిర్వహించుకోవాల్సిన దౌర్భగ్య పరిస్థితి. ప్రభుత్వం శ్మశాన వాటికల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్న తరహాలోనే ఇల్లు లేని పేదల కోసం ధర్మశాలలు ఏర్పాటు చేసి కర్మకాండలు నిర్వహించుకునే సౌకర్యం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. 
     
     
మరిన్ని వార్తలు