మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం

21 Aug, 2016 19:26 IST|Sakshi
  • ఖననం చేసిన తరువాత మృతిపై అనుమానం
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన మృతుడి భార్య 
  • పోరండ్లలో తహసీల్దార్‌ సమక్షంలో విచారణ
  • తిమ్మాపూర్‌ : మండలంలోని పోరండ్ల గ్రామానికి చెందిన పార్నంది చంద్రయ్య(55) మృతిపై అతడి భార్య అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసుకు ఫిర్యాదు చేయడంతో ఖననం చేసిన మృతదేహాన్ని ఆదివారం వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించడం చర్చనీయాంశమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకార ం.. చంద్రయ్య బ్రాస్‌బ్యాండ్‌ కూలీగా పనిచేసేవాడు. ఈనెల 15న ఉదయం చంద్రయ్యను పోరండ్లకు చెందిన కిన్నెర రాజయ్య బ్యాండ్‌ పని కోసం తీసుకెళ్లాడు. రాత్రి వరకు చంద్రయ్య ఇంటికి రాలేదు. అదే రోజు సాయంత్రం సుభాష్‌నగర్‌ సమీపంలోని శివాజీనగర్‌ వద్ద పడిపోయి ఉండగా స్థానికులు 108కి సమాచారం అందించారు. 108 సిబ్బంది వచ్చే చూసేసరికి చంద్రయ్య చనిపోవడంతో పోలీసులు శవాన్ని కరీంనగర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు.  మరునాడు మృతుడిని పోరండ్లకు చెందిన వ్యక్తిగా గుర్తించిన పోలీసులు అతడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. తన భర్త గుండెపోటుతో మృతి చెందినట్లు భావిస్తూ ఎలాంటి అనుమానాలు లేవని భార్య పార్నంది లక్ష్మీ పోలీసులకు లిఖితపూర్వంగా రాసిచ్చింది. శవాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లి అదే రోజు రాత్రి ఖననం చేశారు. అయితే చంద్రయ్యతోపాటు మరో ఇద్దరు వాహనంపై వెళ్లినట్లు, ఆ తరువాత కొద్ది సేపటికే అతను పడిపోయినట్లు స్థానికులు మృతుడి కుటుంబసభ్యులకు తెలిపారు. దీంతో చంద్రయ్యను ఇంటి నుంచి తీసుకెళ్లిన కిన్నెర రాజయ్యపై, వాహనంపై తీసుకెళ్లిన వ్యక్తులపై అనుమానం ఉందని ఈనెల 20న లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఆదివారం కరీంనగర్‌ ట్రాఫిక్‌ ఎస్సై ఎం.రమేష్, తిమ్మాపూర్‌ తహసీల్దార్‌ కోమల్‌రెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు అర్చన, ట్రాఫిక్‌ ఏఎస్సై ఇషాక్, ఎల్‌ఎండీ హెడ్‌కానిస్టేబుల్‌ హన్మంతరావు పోరండ్లకు చేరుకుని ఖననం చేసిన మృతదేహాన్ని కుటుంబసభ్యుల సమక్షంలో బయటకు తీయించి, పోస్టుమార్టం నిర్వహించారు. చంద్రయ్యను తీసుకెళ్లిన వ్యక్తులు అతడు పడిపోయిన విషయాన్ని తమకు తెలుపకపోవడంపై అనుమానం ఉందని తహసీల్దార్‌కు లక్ష్మి ఫిర్యాదు చేసింది. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తు చేపడుతామని ఎస్సై రమేష్‌ తెలిపారు. పోస్టుమార్టం స్థలానికి సీపీఐ జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు బోయిని అశోక్, ఒగులాపూర్‌ సర్పంచ్‌ జయపాల్‌రెడ్డి తదితరులు వచ్చి మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని అధికారులను కోరారు. 
     
     
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు