జిల్లా అభివృద్ధికి పునరంకితం కావాలి

27 Jan, 2017 00:43 IST|Sakshi
జిల్లా అభివృద్ధికి పునరంకితం కావాలి
గణతంత్ర వేడుకల్లో కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌
కాకినాడ సిటీ : సమైక్యత, సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుతూ జిల్లా అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని జిల్లా కలెక్టర్‌ హెచ్‌.అరుణ్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. గురువారం స్థానిక పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో 68వ భారత గణతంత్ర
దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాస్థాయి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీస్, ఎన్‌సీసీ దళాలు నిర్వహించిన సంప్రదాయ కవాతును తిలకించి, గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ ఈ ఏడాది కొత్తగా మూడు వేల ఎకరాల ఉద్యాన భూములకు మైక్రో ఇరిగేషన్‌ వసతులను విస్తరిస్తున్నామని తెలిపారు. కోడిగుడ్ల ఉత్పత్తిలో జిల్లా దేశంలోనే అగ్రస్థానంలో ఉండగా, సాలీనా 2 లక్షల టన్నుల ఉత్పత్తులతో రాష్ట్ర మత్స్యరంగంలో నాల్గో స్థానంలో నిలిచిందన్నారు. డ్వాక్రా సంఘాల మహిళలకు ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.81 కోట్లు వడ్డీ రాయితీ జమ చేశామని, రుణమాఫీ పథకం రెండో విడతగా రూ.258 కోట్ల పెట్టుబడి నిధిని 8 లక్షల 60 వేల మంది సభ్యులకు పసుపు–కుంకుమలుగా పంపిణీ చేశామన్నారు. ప్రతిష్టాత్మక పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా ఏలేరు పరిధిలో 67 వేల హెక్టార్లు, పిఠాపురం బ్రాంచి కాలువ పరిధిలో 20 వేల హెక్టార్లు ఆయకట్టు స్థిరీకరణలోకి రానుందన్నారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద రూ.367 కోట్ల వ్యయంతో కోటి 39 లక్షల మందికి ఉపాధి కల్పించామన్నారు. ఎన్‌.టి.ఆర్‌. గృహ నిర్మాణ పథకం కింద 24 వేల గృహాలు నిర్మాణం, 17 వేల ఇళ్ళకు మరమ్మతులు చేపట్టామన్నారు. రానున్న రెండేళ్ళలో 600 పాఠశాలల్లో 1200 డిజిటల్‌ తరగతి గదులు ప్రారంభిస్తున్నామని, 370 ఆదర్శ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధన ప్రవేశపెట్టామన్నారు.ఈ సంవత్సరం 96 కోట్ల నిధులతో షెడ్యూల్డ్‌ కులాలకు, రూ.6.62 కోట్ల నిధులతో షెడ్యూల్డ్‌ తెగలకు, రూ.44 కోట్ల నిధులతో విభిన్న ప్రతిభావంతులకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా రూ.162 కోట్ల నిధులతో రక్షిత తాగునీటి పథకాల నిర్మాణం, రూ.485 కోట్ల నిధులతో ఆర్‌అండ్‌బి రహదారుల అభివృద్ధి, రూ.325 కోట్ల నిధులతో పంచాయతీరాజ్‌ రోడ్ల అభివృద్ధి, రూ.126 కోట్ల నిధులతో విద్యుత్‌ సరఫరా విస్తరణ పనులు జరుగుతున్నాయన్నారు. జిల్లాలో వినూత్నంగా చేపట్టిన అంశాలు జిల్లాలో నగదు రహిత లావాదేవీల విస్తరణ, పర్యాటక అభివృద్ధిని వివరించారు.  ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ నామన రాంబాబు, జిల్లా పోలీస్‌ సూపరింటెండెంట్‌ ఎన్‌.రవిప్రకాష్, జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ, జాయింట్‌ కలెక్టర్‌–2 జె.రాధాకృష్ణమూర్తి విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం వేడుకలకు హాజరైన స్వాతంత్య్ర సమరయోధుడు 98 ఏళ్ళ చోడిపల్లి హనుమంతరావును జిల్లా కలెక్టర్‌ అరుణ్‌ కుమార్, జెడ్పీ ఛైర్మన్‌ నామన రాంబాబు ఘనంగా సత్కరించారు. 
సంక్షేమాలు, ఆస్తుల పంపిణీ...
గణతంత్ర దినోత్సవాల్లో భాగంగా ఆరు ప్రభుత్వశాఖల ఆధ్వర్యంలో 1,788 మంది లబ్ధిదారులకు రూ.55 కోట్ల 30 లక్షలు విలువైన ఆస్తులు, ఉపకరణాలను కలెక్టర్‌ పంపిణీ చేశారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
అట్టహాసంగా నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో జాతీయ సమగ్రత పెల్లుబికింది. దేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే నృత్యాలు, దేశభక్తిని ప్రబోధించే గీతాలు, జిల్లా ప్రగతిని చాటిచెప్పే శకటాలు, ఒళ్లు గగుర్పొడిచే సాహస నృత్యాలు, ఆహుతులను కట్టిపడేశాయి. వివిధ శాఖలు, సంస్థలు ఏర్పాటు చేసిన స్టాళ్లు సందడితో గురువారం జిల్లా కేంద్రం కాకినాడ పోలీస్‌  పెరేడ్‌ మైదానంలో నిర్వహించిన 68వ గణతంత్ర  వేడుకలు కనువిందు చేశాయి. ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు  సాగిన ఈ ఉత్సవాల్లో జిల్లాలోని వివిధ పాఠశాలకు చెందిన రెండు వేల మంది విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించారు. వేడుకల్లో 8 పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొని తమ నృత్యప్రదర్శనలతో అలరించారు. భరత ఖండమే నాదేశం.. అంటూ కాకినాడ ఎంఎస్‌ఎన్‌ ఎయిడెడ్‌ హైస్కూల్‌ జగన్నాథపురం, గణతంత్రానికి శుభోదయం.. అంటూ జెడ్పీహెచ్‌ తూరంగి పేట, వందేమాతరం... అంటూ జెడ్పీహెచ్‌ పవర, ఇండియా వాలే..అంటూ ఉమామనోవికాసం కేంద్రం మానసిక దివ్యాంగులు, సత్యమేవజయతే.. అంటూ జెడ్పీహెచ్‌ ఇంద్రపాలెం, క్విట్‌ ఇండియా.. అంటూ సెయింటాన్‌ ఎయిడెడ్‌ స్కూల్‌ జగన్నాథపురం, జయహో.. అంటూ నారాయణ ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌ రామారావుపేట, మేరాభారత్‌ మహా.. అంటూ గమ్యం స్కూల్‌ జి.మామిడాడ విద్యార్ధినీ,విద్యార్ధులు నృత్యప్రదర్శనలు ఇచ్చారు.
 
మరిన్ని వార్తలు