అధిక ఉత్పత్తి లక్ష్యంగా పరిశోధనలు

4 Apr, 2017 22:36 IST|Sakshi
అధిక ఉత్పత్తి లక్ష్యంగా పరిశోధనలు
మార్టేరు (పెనుమంట్ర): కాలానుగుణంగా అధిక దిగుబడినిచ్చే వంగడాల కోసం మార్టేరు వరి పరిశోధనా సంస్థలో నిరంతర ప్రక్రియగా పరిశోధనలు సాగుతున్నాయని ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకుడు కె.రాజారెడ్డి అన్నారు. మార్టేరు వరి పరిశోధనా స్థానంలో మంగళవారం మెగా కిసాన్‌ మేళా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడుతూ దేశంలోని 50 వరి పరిశోధనా స్థానాల్లో మరెక్కడా లేనన్ని మేలైన విత్తనాలు సృష్టించి దేశవ్యాప్తంగా ఉన్న సాగుభూమిలో 25 శాతం మార్టేరు విత్తానాలు సాగులో ఉండేలా కృషిచేయడం అభినందనీయమన్నారు. రూ.6 కోట్లతో సంస్థలో బయోటెక్నాలజీ ల్యాబ్‌ను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. అన్నదాతలను ఆర్థికంగా ఆదుకునే మేలైన వంగడాలు మరిన్ని అందుబాటులోకి రావాలని రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. శాస్త్రవేత్తల పరిశోధనా ఫలితాలు క్షేత్రస్థాయిలో రైతులకు చేరువైనప్పుడే వారి కృషికి సార్థకత ఉంటుందన్నారు. రైతు క్షేమం లక్ష్యంగా పరిశోధనలు ఉండాలని ఆకాంక్షించారు. ఆరోగ్యకర పంటల సాగు పెరగాలని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. నరసాపురం, తణుకు ఎమ్మెల్యేలు బండారు మాధవనాయుడు, ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడారు. డీసీడీసీ చైర్మన్‌ ముత్యాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మార్టేరు విత్తనాలు వరి రైతులకు సిరులు పండిస్తున్నాయని అభినందించారు. 
పరిశోధనా సంచాలకుడు ఎన్‌వీ నాయుడు, రిజిస్ట్రార్‌ టీవీ సత్యనారాయణ, సంస్థ డైరెక్టర్‌ పీవీ సత్యనారాయణ, జిల్లా సంయుక్త వ్యవసాయ సంచాలకులు వై.సాయిలక్ష్మీశ్వరి, తూర్పుగోదావరి జిల్లా సంయుక్త సంచాలకులు కేఎన్‌వీ ప్రసాద్, డీసీఎంఎస్‌ చైర్మన్‌ భూపతిరాజు రవివర్మ, పాలక మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 
 
ఆకట్టుకున్న స్టాల్స్‌
వరి, వాణిజ్య, ఉద్యాన పంటలపై రైతులకు శాస్త్రజ్ఞులు అవగాహన కల్పించారు. మెళాలో ఏర్పాటుచేసిన వ్యవసాయ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సంస్థ శాస్త్రవేత్తలు రూపొందించిన 15 రకాల వంగడాలు, త్వరలో అందుబాటులోకి రానున్న రకాలను ప్రదర్శించారు. ఇక్కడే రూపుదిద్దుకున్న స్వర్ణతో పాటు దేశవ్యాప్తంగా ఖ్యాతిగాంచిన 1121, 1156, 1153, 1140, 1129 రకాలను ఎక్కువ మంది రైతులు తిలకించారు. వరితో పాటు, మొక్కజొన్న, కొబ్బరి, అరటి వంటి వాణిజ్య, ఉద్యాన పంటలపై శాస్త్రజ్ఞులు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ఆసక్తిగా పరిశీలించారు. పాడి పెంపకం, పశుగ్రాస రకాలపై అవగాహన పెంచేలా ప్రదర్శనలు ఏర్పాటుచేశారు. 
 
రైతుల హాజరు తక్కువ
కిసాన్‌ మేళాకు పెద్దెత్తున ఏర్పాట్లు చేసినా ఆశించిన స్థాయిలో రైతులు రాలేదు. 5 వేల మంది రైతులను ఆహ్వానించినట్టు అధికారులు చెబుతున్నా రైతుల సంఖ్య అంతంతమాత్రంగానే ఉంది. పురుగు మందులు, ఎరువులు, విత్తన కంపెనీల ప్రతినిధులు, వారి సిబ్బంది హడావుడి బాగా కనిపించింది. కుర్చీలన్నింటినీ ఆయ కంపెనీల సిబ్బంది, కళాశాల విద్యార్థులతో నింపేశారు. 
మరిన్ని వార్తలు