విమానాశ్రయానికి నీటి కోసం అన్వేషణ

15 Mar, 2017 00:49 IST|Sakshi
– ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజినీర్లతో ఎయిర్‌ఫోర్సు అధికారుల చర్చలు
 
కర్నూలు(అర్బన్‌): ఓర్వకల్లు సమీపంలో ఏర్పాటు కానున్న విమానాశ్రయానికి నీటిని ఎక్కడి నుంచి తీసుకురావాలనే అంశంపై ఎయిర్‌ఫోర్సు అధికారులు అన్వేషణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం సాయంత్రం ఎయిర్‌ఫోర్సు అథారిటీ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ వి. రవికుమార్‌ నేతృత్వంలో ప్రాజెక్టు ఇన్‌చార్జీతో పాటు నలుగురు ఇంజినీర్ల బృందం కర్నూలు ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ వెంకటరమణతో సమావేశమయ్యారు. ఈవిమానాశ్రయం ఏర్పాటు చేస్తున్న ప్రాంతంలో నీటి వనరుల గురించి చర్చించారు. అలాగే గ్రామీణ నీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో నీటిని సరఫరా చేసే విషయాన్ని కూడా వారు ప్రస్తావించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్‌డబ్ల్యూఎస్‌ నుంచి నీటిని సరఫరా చేయడం సాధ్యం కాదని, ఇతర మార్గాలు ఏవైనా ఉంటే అన్వేశించాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ   సూచించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే అలగనూరు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుంచి దాదాపు 20 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ల ద్వారా నీటిని సరఫరా చేసుకునే అంశం కూడా సమావేశంలో చర్చకు వచ్చింది. ఇందుకు రూ.8 కోట్ల మేర వ్యయం అవుతుందని అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఈ సమావేశంలో కర్నూలు డీఈఈ మురళీ, ఓర్వకల్లు జేఈ కిరణ్‌ పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు