ప్రజా ఫిర్యాదులపై స్పందించాలి

26 Jul, 2016 00:33 IST|Sakshi
ప్రజా ఫిర్యాదులపై స్పందించాలి

కడప సెవెన్‌రోడ్స్‌ :
వివిధ సమస్యలపై ప్రజలు ఇచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు తక్షణమే స్పందించాలని కలెక్టర్‌ కేవీ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. సోమవారం కొత్త కలెక్టరేట్‌లో నిర్వహించిన మీ కోసం కార్యక్రమంలో ఆయన వినతులు స్వీకరించారు. ప్రతి సోమవారం వందల సంఖ్యలో ప్రజలు మీ కోసం కార్యక్రమానికి వస్తున్నారని పేర్కొన్నారు. మండల స్థాయిలోనే సమస్యలను పరిష్కరించడంపై దృష్టి
సారించాలన్నారు. కిందిస్థాయిలో పరిష్కారం కాని సమస్యలు మాత్రమే కలెక్టరేట్‌కు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలను కలెక్టర్‌కు విన్నవించారు.


సర్వే నెంబరు 1747/10–4లో తనకున్న 39సెంట్ల భూమిని ఆన్‌లైన్‌లో నమోదు చేయించాలని వీరబల్లి మండలం గుర్రప్పగారిపల్లెకు చెందిన పద్మావతి కోరారు. – తన భర్త మరణించినందున జీవనం కష్టంగా ఉందని, తనకు వితంతు పెన్షన్‌ మంజూరు చేయాలని దువ్వూరు మండలం సింగసింగనిపల్లెకు చెందిన దస్తగిరమ్మ కోరారు. వృద్ధాప్యంతో బాధపడుతున్న తాను ఏ పని చేయలేకున్నానని, జీవనాధారం కోసం పెన్షన్‌ మంజూరు చేయాలని కడప నగరం సంగంపేటకు చెందిన సరోజమ్మ కోరారు. తనకున్న ఎకరా 68 సెంట్ల పొలానికి ఈ–పాస్‌ పుస్తకం ఇప్పించాలని ఎర్రగుంట్ల మండలం తిప్పలూరుకు చెందిన మహమ్మద్‌ రఫీ కోరారు. ఈ కార్యక్రమంలో జేసీ శ్వేత తెవతీయ, ఇన్‌ఛార్జి జేసీ–2 నాగేశ్వరరావు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

 

మరిన్ని వార్తలు