రహదారుల పక్కనే విశ్రాంతి

24 Aug, 2017 10:51 IST|Sakshi
రహదారుల పక్కనే విశ్రాంతి

ప్రయాణికులు, డ్రైవర్ల కోసం వే సైడ్‌ ఎమినిటీ సెంటర్లు
సరికొత్త విధానాన్ని ఆవిష్కరించిన కేంద్రం  


కడప కార్పొరేషన్‌ :
దేశంలోని అన్ని జాతీయ రహదారు ల పక్కన ప్రయాణికులు, డ్రైవర్ల కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒకటి చొప్పున సౌ కర్య కేంద్రాలు (వే సైడ్‌ ఎమినిటీ సెంటర్లు) అభివృద్ధి చేయాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ నిర్ణయించింది. కారు, బస్సు ప్రయాణిలతోపాటు భారీ వాహనాల డ్రైవర్లు విశ్రాంతి తీసుకునేందుకు వీటిలో సదుపాయాలు కల్పించనున్నారు. జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ)ఈ బాధ్యతలు చూసుకుంటుంది. అమెరికా, జర్మనీ తరహాలో ఈ కేంద్రాలను అభివృద్ధి చేయనున్నారు. ఈ మేరకు సరికొత్త విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించింది.

ఈ కేంద్రాల్లో కార్లు, బస్సులు, ట్రక్కులకు పార్కింగ్‌ స్థలాలు కేటాయిస్తారు. పెట్రోల్‌ బంకులు, వాహన మరమ్మతు కేంద్రాలు, విశ్రాంతి గదులు, డార్మిటరీలు, రెస్టారెంట్లు, ఫుడ్‌ కోర్టులు, దాబాలు, వ్యవసాయ, చేనేత ఉత్పత్తుల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. భవిష్యత్లు రాబోతున్న ఎలక్ట్రిక్‌ కార్లను దృష్టిలో ఉంచుకొని విద్యుత్‌ చార్జింగ్‌ వ్యవస్థలు నెలకొల్పుతారు. మూడు భాగాలుగా ఈ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి.

సెప్టెంబర్‌ 21 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు
ఐదు ఎకరాలలోపు స్థలం ఉండి స్థలంలో ఏర్పాటయ్యే కేంద్రాన్ని హైవే నెస్ట్‌ అని, అంతకన్నా ఎక్కువ స్థలంలో నెలకొల్పే కేంద్రాన్ని హైవే విలేజ్‌ అని పిలుస్తారు. ఐదు ఎకరాలకు పైబడి స్థలం ఉన్న వ్యక్తులు సొంతగా నూ ఈ కేంద్రాలను అభివృద్ధి చేసుకోవచ్చు. ముందుకొచ్చేవారికి ప్రభుత్వమే జాతీయ రహదారుల అనుసంధానాన్ని కల్పిస్తుంది. జాతీయ రహదారులకు ఆనుకొని భూములున్న ప్రైవేటు వ్యక్తులు ఆగష్టు 4 నుంచి తమ ఆసక్తిని వ్యక్తం చేస్తూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎన్‌హెచ్‌ఏఐ ప్రాంతీయ కార్యాలయాల్లో సెప్టెంబర్‌ 21లోపు దరఖాస్తులు దాఖలు చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి–తిరుత్తణి, చెన్నై సెక్షన్‌లో ఎన్‌హెచ్‌–205పై ఎస్‌వీ పురం గ్రామం వద్ద, అనంతపురం–బెంగళూరు సెక్షన్‌లో రేగాటిపల్లి గ్రామం వద్ద (అనంతపురం జిల్లా) ఇలాంటి కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. త్వరలో ఇతర జాతీయ రహదారుల్లో కూడా వీటిని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ కేంద్రాల్లో విశ్రాంతి తీసుకోవడానికి, పార్కింగ్, ఇతర అవసరాలను బట్టి నిర్ణీత ధరలను నిర్ణయించనున్నారు.  

ప్రయాణికుల అవసరాలు తీరేలా సదుపాయలు
తొలి విభాగంలో సాధారణ ప్రయాణికులు, భారీ వాహనాల డ్రైవర్ల అవసరాలకు తగినట్లుగా, రెండో విభాగంలో ప్రత్యేక తరగతి ప్రయాణికుల అవసరాలు తీర్చేలా సదుపాయాలు ఉంటాయి. మూడో విభాగాన్ని ట్రక్‌ డ్రైవర్లకు కేటాయిస్తారు. మొత్తం స్థలంలో 20 శాతంలోనే నిర్మాణాలుంటాయి. మిగిలిన 80 శాతం పార్కింగ్, ఇతర వినోద సదుపాయాలకు కేటాయిస్తారు.

మరిన్ని వార్తలు