సడలిన ఆంక్షలు

28 Jul, 2017 23:17 IST|Sakshi
సడలిన ఆంక్షలు
– ఆగస్టు 3న పాదయాత్రకు వస్తానన్న ముద్రగడ 
– అప్పటి వరకు హౌస్‌ అరెస్ట్‌లోనే 
– ఇంటి వద్ద ఆంక్షలు సడలించిన పోలీసులు 
– ముద్రగడను కలిసేందుకు అందరికీ అనుమతి 
– కొనసాగుతున్న పికెట్లు, చెక్‌పోస్టులు 
– ముద్రగడకు మద్దతుగా కొనసాగుతన్న నిరసనలు
సాక్షి, రాజమహేంద్రవరం: ముద్రగడ పద్మనాభం తలపెట్టిన చలో అమరావతి పాదయాత్రను అడ్డుకోవడడంతోపాటు వారం రోజులు ఆయన్ను గృహ నిర్బంధించి, ఎవరూ కలవకుండా ఆంక్షలు విధించడంతో వచ్చిన ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో శుక్రవారం ప్రభుత్వం కొంత మేర ఆంక్షలు సడలించింది. ఈ నెల 19వ తేదీ నుంచి గురువారం వరకు ముద్రగడ ఇంటి ఛాయలకు మీడియాతో సహా ఎవ్వరినీ రానీయని పోలీసులు ఆగస్టు 3వ తేదీన పాదయాత్రకు ఇంటి నుంచి వస్తానని ముద్రగడ ప్రకటించడంతో శుక్రవారం కొద్దిమేర ఆంక్షలు సడలించారు. మీడియాను ఇంట్లోకి అనుమతించారు. కాపు నేతలు, సాధారణ ప్రజలు ముద్రగడను కలిసేందుకు అనుమతించారు. లోనికి వెళ్లే వారి పేరు, వివరాలు తీసుకుని పోలీసులు అనుమతి ఇస్తున్నారు. 
బాబు మనసు మారాలని పూజలు...
కాపు సమాజికవర్గంపై ముఖ్యమంత్రి చంద్రబాబు మనసు మారాలని, ముద్రగడ పాదయాత్ర సాఫీగా జరగాలని మలికిపురం మండలం చింతలమోరిలో మహిళలు, విద్యార్ధులు స్థానిక శ్యామలాంబ ఆలయంలో పూజలు చేశారు. కాపు సామాజిక వర్గ విద్యార్థులు తరగతులను బహిష్కరించి ఆందోళనలో పాల్గొన్నారు. అమలాపురంలో వైఎస్సార్‌సీపీ మహిళా నేత కొల్లాటి దుర్గాభవాని చంద్రబాబుకు బుద్ధి రావాలని వరలక్ష్మి వ్రతం చేశారు. తుని మండలం ఎస్‌.అన్నవరం నుంచి కిర్లంపూడికి ముద్రగడకు మద్దతుగా ర్యాలీ నిర్వహిస్తున్న 40 మందిని పోలీసులు అరెస్టు చేశారు. రాజమహేంద్రవరం రూరల్‌ మండలం ధవళేశ్వరంలో కాపు ఉద్యమానికి మద్దతుగా రంగా విగ్రహానికి కాపులు పాలాభిషేకం చేశారు. కడియంలో మద్యంషాపులపై అఖిలపక్ష సమావేశానికి వెళ్తున్న గిరిజాల బాబును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన రోడ్డుపై బైఠాయించారు. కాకినాడలో కాపు న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో ఇంద్రపాలెం సెంటర్‌లో ఉన్న అంబేడ్కర్‌ విగ్రహం వద్ద వినతి పత్రాన్ని ఉంచి కాపు న్యాయవాదులు నిరసన తెలిపారు.
కొనసాగుతన్న పికెట్లు, చెక్‌పోస్టులు...
 వచ్చే నెల 3వ తేదీన పాదయాత్ర చేస్తానని ముద్రగడ ప్రకటించడంతో జిల్లాలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులు, పోలీస్‌ పికెట్లు కొనసాగుతున్నాయి. 16వ నంబర్‌ జాతీయ రహదారిలో జగ్గంపేట, ప్రత్తిపాడు వద్ద, కిర్లంపూడి గ్రామం చుట్టుపక్కల ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద  యథాతథంగా తనిఖీలు చేశారు.
తల్లడిల్లుతున్న పోలీసు ‘అమ్మ’ 
ఈ నెల 26న పాదయాత్ర చేపడతానని ముద్రగడ ప్రకటించడంతో వారం రోజులు ముందుగానే పోలీసుల బలగాలను కిర్లంపూడికి తరలించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి సివిల్‌ పోలీసులను రప్పించారు. ఇందులో మహిళా పోలీసులు దాదాపు 200 మంది ఉన్నారు. వీరిలో ఏడాది నుంచి రెండేళ్ల లోపు వయసున్న పిల్లలు కలిగిన తల్లులున్నారు. వారం రోజులుగా చంటి పిల్లలకు దూరంగా ఉంటూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.డ్యూటీలు మారుస్తామని, తమ స్థానంలో కొత్త వారిని తెస్తామని, తిరిగి తమ జిల్లాలకు పంపుతామని  మూడు రోజులుగా అధికారులు చెబుతున్నారే తప్ప ఆచరణలో చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
మరిన్ని వార్తలు