‘కోడ్’ కొర్రి పెట్టింది

29 Oct, 2015 04:10 IST|Sakshi

వరంగల్‌లో ఎన్నికల వేళ మద్యం అమ్మకాలపై ఆంక్షలు
 
 సాక్షి, హైదరాబాద్: సాధారణంగా ఎన్నికలు వస్తున్నాయంటే మద్యం వ్యాపారులకు పండుగే! 4 నెలల్లో అమ్మే సరకు వారంలొనే విక్రయించి లాభాలు పొందుతారు. అయితే వరంగల్ లోక్‌సభ స్థానానికి ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదలైనా అక్కడి వ్యాపారులు మాత్రం లబోదిబోమంటున్నారు. ఓటర్లకు భారీగా మద్యం పంపిణీ చేస్తున్నారన్న కారణంతో ఎన్నికల కమిషన్ సరకు స్టాక్ పంపిణీపై ఆంక్షలు విధిం చింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన ఈ నెల 21 నుంచి ఫలితాలు వెల్లడించే నవంబరు 24 వరకు మద్యం (ఐఎంఎల్, బీరు) అమ్మకాలు గతేడాది ఇవే తేదీల్లో జరిగిన విక్రయాలకు మించవద్దని ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. మద్యం వ్యాపారులు డిపోల నుంచి స్టాక్‌ను తీసుకునేటప్పటి నుంచే ఈ ఆంక్షలు అమలులోకి వస్తాయి.

2014లో అక్టోబర్ 21 నుంచి నవంబర్ 24 వరకు ఒక షాపు రూ.10 లక్షల విలువైన మద్యం స్టాక్‌ను డిపోల నుంచి తీసుకుంటే ఆ దుకాణానికి ఈసారి కూడా దాదాపు అంతే విలువైన మద్యాన్ని (పెట్టెల లెక్కన) ఇవ్వడం జరుగుతుంది. కొత్త మద్యం విధానం ఈనెల నుంచే అమలులోకి రాగా వరంగల్ గ్రేటర్ కార్పొరేషన్‌గా మారిన నేపథ్యంలో లెసైన్సు ఫీజును రూ.20 లక్షల మేర పెంచారు. ఈ పరిస్థితుల్లో అందివచ్చిన ఉప ఎన్నిక ద్వారా విక్రయాలు పెంచి లాభాలు పొందాలనుకున్న వ్యాపారులకు ఎన్నికల కమిషన్ నిర్ణయంతో దిమ్మతిరిగినట్లయింది.

మరిన్ని వార్తలు