రేసుగుర్రాలు

13 Aug, 2016 01:12 IST|Sakshi
రేసుగుర్రాలు
  • అథ్లెటిక్స్‌లో అలరిస్తున్నఓరుగల్లు ముద్దుబిడ్డలు
  • ఉదయం, సాయంత్రం వేళల్లో మైదానంలో ప్రత్యేక శిక్షణ
  • అంతర్జాతీయ గుర్తింపు కోసం అలుపెరుగని పోరాటం
  • ఆన్‌ యువర్‌ మార్క్‌.. గెట్‌.. సెట్‌.. గో.. అనగానే అథ్లెటిక్స్‌ ట్రాక్‌పై వారు ఒక్క ఉదుటున కదులుతారు.. అడవిలో జింకను వేటాడే చిరుతలా మెరుపు వేగంతో పరుగెత్తి అలవోకగా లక్ష్యాన్ని చేరుకుంటారు.. గ్రీకు దేశంలో పురుడు పోసుకున్న అథ్లెటిక్స్‌లో జిల్లాకు చెందిన పలువురు క్రీడాకారులు అద్భుతాలు సృష్టిస్తున్నారు. తమదైన ప్రతిభ కనబరుస్తూ రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పతకాలు సాధిస్తూ ప్రముఖుల ప్రశంసలు పొందుతున్నారు.
     
    వరంగల్‌ స్పోర్ట్స్‌ : రన్నింగ్‌ రేస్‌ పోటీలు సాధారణంగా పాఠశాలలో గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవాల సమయంలో పిల్లలకు నిర్వహిస్తుంటారు. ఈ పోటీల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థుల్లో చురుకుదనం పెరిగి, కండరాలు బలిష్టంగా తయారవుతాయని వ్యాయామ ఉపాధ్యాయుల అభిప్రాయం. వాస్తవంగా అథ్లెటిక్స్‌ అనే పేరు చెప్పగానే భారతదేశ ప్రజలకు టక్కున గుర్తుకొచ్చే క్రీడాకారులు పీటీ ఉష, అశ్విని నాచప్ప. సినీ నిర్మాతలు వారి స్ఫూర్తిని ప్రజలకు తెలియజేసేందుకు సినిమాలు కూడా తీశారంటే సదరు క్రీడాకారుల ప్రాధాన్యత ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. పీటీ ఉష తర్వాత 36 ఏళ్ల అనంతరం ఒలింపిక్స్‌లో భారతదేశం తరపున 100 మీటర్ల పరుగులో అర్హత సాధించిన అథ్లెట్‌ ద్యుతీచంద్‌. అనేక ఒడిదొడుకుల అనంతరం తాజాగా జరుగుతున్న రియో ఒలింపిక్‌్సకు చేరుకున్న ద్యుతీచంద్‌ కృషి, శ్రమ, పట్టుదల మాటల్లో చెప్పలేనివి. ఈ సారి ఆమె పతకాలు సాధించి ఇం డియా పేరును నిలబెడుతుందని ఓరుగల్లు క్రీడాకారులు ఆశాభావం వ్యక్తం చే స్తున్నారు.
     
    అన్ని దేశాల్లో ప్రాచుర్యం
    క్రీస్తు పూర్వం 776లో గ్రీకు దేశంలో అథ్లెటిక్స్‌ పురుడు పోసుకుంది. అయితే 19, 20వ శతాబ్దాల్లో పశ్చిమ ఐరోపా, ఉత్తర అమెరికా దేశాలు అథ్లెటిక్స్‌ నియమాలు, నిబంధనలు రూపొందించి పోటీలు నిర్వహించాయని చరిత్ర చెబుతోంది. తర్వాత ప్రపంచంలోని అన్ని దేశాల్లో అథ్లెటిక్స్‌ ప్రాచుర్యం పెరిగింది. అథ్లెటిక్స్‌ అనగానే ప్రధానంగా రన్నింగ్, వాకింగ్, షాట్‌పుట్, హైజంప్, లాంగ్‌జంప్, తదితర క్రీడలు ఉంటాయి.
     
    అలరిస్తున్న అశ్విని 
    వరంగల్‌కు చెందిన కె. అశ్విని అథ్లెటిక్స్‌లో ప్రతిభ కనబరుస్తూ శభాష్‌ అనిపించుకుంటోంది. వరంగల్‌ స్పోర్ట్స్‌ అకాడమీలో పదేళ్లుగా శిక్షణ పొందుతున్న ఆమె ఇప్పటివరకు పలు రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో బంగారు, వెండి పతకాలు సాధిం చింది.  2013, 2014, 2015లో పంజాబ్‌లోని పాటియాల, మహారాష్ట్ర, మంగళూరులో సీనియర్స్‌ ఇంటర్‌ యూనివర్సిటీ జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని అద్భు త ప్రదర్శన ఇచ్చింది. కాకినాడలో 2014 లో జరిగిన సౌత్‌ ఇండియా జాతీయ, రాష్ట్రస్థాయి పోటీలతోపాటు  వరంగల్, హైదరాబాద్‌లో 2013లో జరిగిన పోటీల్లో 50కి పైగా పతకాలు సాధించింది.
     
    పతకాల శ్రీకాంత్‌ 
    వరంగల్‌ స్పోర్ట్స్‌ హాస్టల్‌లో ఉంటున్న ఎ. శ్రీకాంత్‌నాయక్‌ ఐదేళ్లుగా అథ్లెటిక్స్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు. జూనియర్స్‌ విభాగంలో ఆయన 30 వరకు రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని 40 వరకు బంగారు, వెండి, రజత పతకాలు సాధించాడు. ఎస్‌జీఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రాంచి లో 2014లో జరిగిన 400 మీటర్ల పరుగులో సిల్వర్, గుడివాడలో 2015లో జరిగిన 400 మీటర్ల పరుగులో సిల్వర్, కాకినాడలో 2014లో జరిగిన ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ 100 మీటర్ల పరుగులో సిల్వర్‌ పతకాలను సాధించాడు.
     
    వరంగల్‌ అకాడమీలో శిక్షణ
    ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అథ్లెట్లు పీటీ ఉష, అశ్విని నాచప్పను స్ఫూర్తిగా తీసుకుని జిల్లాకు చెందిన పలువురు క్రీడాకారులు వరంగల్‌ స్పోర్ట్స్‌ అకాడమీ ద్వారా కొన్నేళ్ల నుంచి ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. ఈ మేరకు కోచ్‌ శ్రీమన్నారాయణ హన్మకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో వారికి నిత్యం 100, 200, 400 మీటర్ల పరుగు పందెంతోపాటు లాంగ్‌జంప్, హైజంప్‌లో మెళకువలు నేర్పిస్తున్నారు. ప్రధానంగా వంద మీటర్ల పరుగు పందెంను 12 సెకన్లలో పూర్తి చేయాలనే పట్టుదలతో అథ్లెట్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాగా, అకాడమీలో శిక్షణ పొందుతున్న పలువురు అథ్లెట్లు ఇప్పటికే అనేక జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించి జిల్లాకు వన్నె తెచ్చారు. 
     
    ‘శ్రావణ’ భరితం
    జిల్లాలోని కొత్తగూడ మండలానికి చెందిన టి. శ్రావణ్‌ డిగ్రీ ఫైనలియ ర్‌ చదువుతూ అథ్లెటిక్స్‌లో రాణిస్తూ వస్తున్నాడు. వరంగల్‌ స్పోర్ట్స్‌ అకాడమీలో 8 ఏళ్లుగా శిక్షణ పొందుతున్న ఆయన 100, 400 మీటర్ల పరుగులో 30 వరకు జాతీ య, రాష్ట్రస్థాయి పోటీ ల్లో పాల్గొని 40 వరకు బంగారు పతకాలు సాదించాడు. అలాగే హైజంప్‌లో కూడా ప్రతిభ కనబరుస్తూ జిల్లాకు కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తున్నారు.  
మరిన్ని వార్తలు