డబ్బు కోసమే హత్య

14 May, 2017 23:37 IST|Sakshi
డబ్బు కోసమే హత్య
ఏఎస్పీ  దామోదర్‌ వెల్లడి  
విశ్రాంత బ్యాంకు మేనేజర్‌ హత్యకేసు నిందితుల అరెస్ట్‌
కాకినాడ క్రైం : జల్సాలు, చెడు వ్యసనాలకు బానిసలుగా మారిన యువకులు డబ్బు కోసం నేర ప్రవృత్తిలోకి వెళ్తున్నారు. కష్టపడకుండా సులువుగా డబ్బు సంపాదించాలనే ప్రయత్నంలో చివరకు మనుషులను హత్యలు చేయడానికి కూడా వెనకాడటం లేదు. డబ్బు కోసం కాకినాడ అశోక్‌నగర్‌కు చెందిన ఓ విశ్రాంత బ్యాంకు మేనేజర్‌ను హత్య చేసిన సంఘటనలో పాల్గొన్న ముగ్గురు యువకులను కాకినాడ క్రైం పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం స్థానిక త్రీటౌన్‌ క్రైం పోలీస్‌స్టేçషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా ఏఎస్పీ ఏఆర్‌ దామోదర్‌  హత్యకేసు వివరాలను వెల్లడించారు. రామచంద్రపురం వెల్లరోడ్డు కాలువగట్టుకు చెందిన బల్లిపాటి వరప్రసాద్‌ (19) కాకినాడలో ఓ మెడికల్‌ షాపులో సేల్స్‌బాయ్‌గా, ఇదే గ్రామం కమ్మవారివీధి గుబ్బలవారిపేటకు చెందిన ఖండవల్లి సత్యప్రభుకిరణ్‌ (20) స్థానికంగా ఓ హొటల్‌లో పనిచేస్తున్నారు. అలాగే కోటవీధి రామకృష్ణనగర్‌కు చెందిన పూళ్ల కామేష్‌ (19) పనిలేకుండా ఖాళీగా తిరుగుతుంటాడు. వీరిలో ఏ1 ముద్దాయి బల్లిపాటి వరప్రసాద్‌ కాకినాడ భానుగుడి సెంటర్‌లోని ఓ ఫార్మసీలో ట్రయినర్‌గా పని చేస్తూంటాడు. కాకినాడ అశోక్‌నగర్‌కు చెందిన విశ్రాంత బ్యాంకు మేనేజర్‌ బులుసు సూరయ్య (75) అనారోగ్యంతో మెడికల్‌ షాపులో మందులు కొంటుండేవారు. ఒకట్రెండుసార్లు ఫోన్‌ చేసి మందులు పంపించాలని ఆర్డర్‌ ఇవ్వగా వరప్రసాద్‌ ఇంటికి తీసుకెళ్లి మందులు ఇచ్చేవాడు. ఆ సమయంలో ఇంటి వాతావరణాన్ని, ఇంట్లో ఉండేవారని, వారి ఆస్తులను పరిశీలించిన ప్రసాద్‌ డబ్బు కోసం వీరిని హతమార్చాలని నిర్ణయించుకుని ఈ విషయాన్ని తన స్నేహితులకు తెలిపాడు. వారు ఒక ప్రణాళిక వేసుకుని ఏప్రియల్‌ 23న సంఘటనా స్థలానికి వెళ్లగా, నాలుగో వ్యక్తి భయపడి వెనక్కివెళ్లిపోవడంతో 24వ తేదీ రాత్రి 7.45 గంటల సమయంలో ముగ్గురూ వెళ్లారు. ఇంటి ముందున్న టూలెట్‌ బోర్డును చూచి వచ్చామని, ఇల్లు చూపించాలంటూ వరప్రసాద్‌ మేడపైకి వెళ్లి విజయలక్ష్మిని కోరాడు. తనతో పాటూ తన స్నేహితులు వచ్చారని చెప్పాడు. ఇల్లు చూపించడానికి కింద ఇంటి తాళం తీసి గదులు చూపిస్తుండగా సూరయ్యను పేపర్‌ కట్టర్‌తో గొంతు కోసి హతమార్చారు. అనంతరం ఏమీ తెలియనట్లు పోర్షన్‌ గదికి తాళం వేసి మేడపైకి వెళ్లి భార్య విజయలక్ష్మిని కూడా హతమార్చి వంటిపై ఉన్న బంగారం, నగదును అపహరించాలని భావించారు. ఈ లోగా విజయలక్ష్మి భర్త ఎక్కడికెళ్లారంటూ ప్రశ్నించడం, బయటకు వెళ్లారని చెప్పడం, కాలనీ అంతా తిరగడం జరిగాయి. మళ్లీ వారు మేడపైకి వెళ్లి మంచినీరు కావాలని అడిగారు. ఈ లోగా వారు సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్, కొడాక్‌ కెమేరా, రెండు బంగారు గాజులు తస్కరించారు. సెల్‌ఫోన్‌ కోసం వెతికిన విజయలక్ష్మి వీరి ప్రవర్తనపై అనుమానం వచ్చి ఇంట్లోంచి బయటకు వచ్చి దొంగా దొంగా అని కేకలేయడంతో ముగ్గురూ అక్కడ నుంచి మోటార్‌బైక్‌పై పరారయ్యారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన క్రైం డీఎస్పీ ఎ.పల్లపురాజు ఆదివారం ఈ ముగ్గురినీ రామచంద్రపురం పూళ్ల కామేష్‌ ఇంటి వద్ద అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి రెండు బంగారు గాజులు, కొడక్‌ కెమెరా, సెల్‌ఫోన్, మోటార్‌బైక్, బ్యాంకు పుస్తకం, ఐడీకార్డు, హత్యకు ఉపయోగించిన పేపర్‌ కట్టర్‌లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వీరిలో పూళ్ల కామేష్‌ తన ఇద్దరు స్నేహితులతో కలసి సొంత పెద్దమ్మ గుండు గంగాలక్ష్మికి మిరపకాయ బజ్జీలో మత్తు మందు పొడి కలిపి, ఆమె మెడలోని 3 కాసుల బంగారు తాడును దొంగిలించినట్లు తెలిపారు. వీటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసును ఛేదించడంలో కృషి చేసిన క్రైం డీఎస్పీ పల్లపురాజు, క్రైం ఎస్సైలు రామారావు, హరీష్‌రావు, ఎంఎస్‌ పాషా, సత్తిరాజు, హెచ్‌సీ గోవిందరావు, పీసీలు చిన్న శ్రీరామ్, వర్మ, అజయ్, బాబు, రాము, మారుతిలను  అభినందించారు.  
మరిన్ని వార్తలు