రెవెన్యూ డివిజన్‌ కోసం కృషి చేయాలి

9 Sep, 2016 23:57 IST|Sakshi
  • ∙ఎన్నికల హామీని ఎమ్మెల్యే నిలబెట్టుకోవాలి
  • ∙డివిజన్‌ కోసం ఇనుగాల 48 గంటల నిరాహార దీక్ష
  • ∙ మాజీ  చీఫ్‌ విప్‌ గండ్ర వెల్లడి
  • పరకాల : పరకాలను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయడం కోసం ఈ ప్రాం తానికి చెందిన స్పీకర్‌ మధుసూదనాచారి కృషి చేయాలని మాజీ చీఫ్‌ విప్‌ గండ్ర వెంకటరమణారెడ్డి కోరారు. గురువారం పట్టణంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాటి నిజాం పాలనకు వ్యతిరేకంగా ఎందరో వీరులు ప్రాణాల ర్పించిన ధీరగడ్డ పరకాలన్నారు. మరో జలియన్‌ వాలాబాగ్‌గా పేరుగాంచిన చారిత్రాక ప్రాంతం పరకాలను నాటి సీఎం ఎన్టీఆర్‌ 1984లో రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించారన్నారు. రాజకీయ కారణాలతో 1987లో ములుగుకు ఆర్డీఓ కార్యాలయాన్ని తరలించుకుపోయారన్నారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుతోనే అభివృద్ధి సాధ్యమని భావించిన కాంగ్రెస్‌ తెలంగాణ రాష్ట్రంను ఏర్పాటు చేసిందన్నారు.  గతం లో రెవెన్యూ డివిజన్‌ కోసం కాంగ్రెస్‌ అనేక ఉద్యమాలను చేపట్టిందన్నారు. ఇటీవల కాంగ్రెస్‌ ఇన్‌చార్జి ఇనుగాల వెంకట్రామ్‌రెడ్డి ఒక్క రోజు దీక్షను చేపట్టారన్నారు. ఎన్నికల్లో ప్రజల ఇచ్చిన హామీని ఎమ్మెల్యే ధర్మారెడ్డి నిలబెట్టుకోవాలన్నారు. వెంకట్రామ్‌రెడ్డి 48 గంటల నిరవధిక దీక్షను చేపట్టబోతున్నారన్నారు. రెండు రోజుల పాటు పరకాల బంద్‌కు ప్రజలు, వ్యాపారులు సిద్ధమవుతున్నారన్నారు. పట్టణంలో ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటు చేయడానికి అన్ని రకాల మౌళిక వసతులు ఉన్నాయన్నారు. సమావేశంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి బొచ్చు కృష్ణారావు, పట్టణ అధ్యక్షుడు బండి సారంగపాణి, కౌన్సిలర్లు పోరండ్ల సంతోష్, బండారి కవితకృష్ణ, మాజీ సర్పంచ్‌ ఇనుగాల రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.  
మరిన్ని వార్తలు