ఒక్క క్లిక్‌తో రెవెన్యూ సేవలు

3 Nov, 2015 04:47 IST|Sakshi
ఒక్క క్లిక్‌తో రెవెన్యూ సేవలు

♦ ఐటీతో భూ సమస్యల పరిష్కారం
♦ సీసీఎల్‌ఏగా బాధ్యతలు స్వీకరించిన రేమండ్ పీటర్
 
 సాక్షి, హైదరాబాద్: ‘అమెరికాలో ఉన్నా, ఆఫ్రికాలో ఉన్నా.. సొంతూళ్లోని తమ భూములతో ప్రతి ఒక్కరికీ ఎంతో అనుబంధం ఉంటుంది. కంప్యూటర్‌లో ఒక్క క్లిక్ చేస్తే తమ భూముల సమాచారం తెలుస్తుందంటే ఎవరైనా  సంతోషిస్తారు. రెవెన్యూ సేవ లన్నింటినీ ఐటీతో అనుసంధానం చేసి, వాటిని ప్రజలకు మరింత చేరువ చేస్త్తా’ అని భూపరిపాలన విభాగం ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) రేమండ్ పీటర్ అన్నారు. నూతన సీసీఎల్‌ఏగా సోమవారం బాధ్యతలు స్వీకరించిన ఆయన తన ప్రాధామ్యాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. భూములకు సంబంధించిన (కబ్జాలు, ఆక్రమణలు లాంటివి) సమస్యలు బాగా పెరిగాయని, రెవెన్యూ ప్రక్రియలకు సాంకేతిక తను జోడించడం ద్వారా వీటిని త్వరితగతిన పరిష్కరించేందుకు వీలవుతుందని చెప్పారు.

 క్రమబద్ధీకరణ వేగవంతం
 రెవెన్యూ శాఖలో ఇప్పటికే ప్రారంభమైన ప్రాజెక్టులన్నింటినీ కొనసాగిస్తానని రేమండ్ పీటర్ చెప్పారు. రాష్ట్రంలో పంట భూములు, రైతులకు సంబంధించిన వివరాల నమోదుకోసం చేపట్టిన ఈ-పహాణీ ప్రక్రియను మరింత పటిష్టంగా అమలయ్యే చర్యలు తీసుకుంటానన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భూముల క్రమబద్ధీకరణ, పేదలకు భూపంపిణీ కార్యక్రమాలను వేగవంతం చేస్తానని తెలిపారు. అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూముల వేలం ప్రక్రియ సక్రమంగా జరిగేలా చూస్తానన్నారు. ప్రభుత్వం తెచ్చిన పారిశ్రామిక విధానానికి అనుగుణంగా పరిశ్రమలకు అవసరమైన భూములను సమకూర్చడంలోనూ క్రియశీలకంగా వ్యవహరిస్తానని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ప్రాధమ్యాలకు అనుగుణంగా పనిచేస్తానని చెప్పారు.ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. నూతన సీసీఎల్‌ఏ రేమండ్ పీటర్‌కు పలువురు ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు.

>
మరిన్ని వార్తలు