ఇసుక లెక్కలు సరే..

22 Sep, 2017 13:52 IST|Sakshi
ఇసుక లెక్కలు సరే..

నిబంధనల అమలు ఎక్కడ? ..
కఠిన శిక్షలు ఏమయ్యాయి?
‘సాక్షి’ కథనంతో అధికారుల్లో చలనం వచ్చినా..


తాడేపల్లిరూరల్‌ : ‘పర్యవేక్షకులే ఇసుకాసురులు’ శీర్షికన ఈనెల 20న ప్రచురించిన ‘సాక్షి’ కథనానికి జిల్లా అధికారులు స్పందించారు. ఇసుక రీచ్‌లలో గురువారం నుంచి రెవెన్యూ సిబ్బందిని ఏర్పాటు చేసి వచ్చి వెళ్లే వాహనాల లోడింగ్‌ వివరాలను సేకరిస్తున్నారు. అలాగే ఎవరికి తోలుతున్నారనే విషయాలను కూడా సేకరిస్తూ లారీ నంబర్‌తో కలిపి ఆధార్‌ కార్డ్‌ను లింక్‌ చేస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది. కానీ ఉచిత ఇసుక పాలసీలో నిబంధనలను మాత్రం గాలికొదిలేశారు. ఎవరైనా తప్పు చేస్తే కఠిన శిక్షలు తప్పవని వివిధ శాఖలకు చెందిన అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీని తీసుకొచ్చింది.

నిబంధనల ప్రకారం రీచ్‌ల నుంచి ఇతర ప్రాంతాలకు ఇసుక తరలించకూడదు. కానీ గుంటూరు జిల్లా నుంచి హైదరాబాద్‌ లాంటి మహానగరాలకే ఇసుక తరలిపోతోంది. అంతేగాక నిబంధనల ప్రకారం ట్రాక్టర్లకు, చిన్న చిన్న ఆరు టైర్ల టిప్పర్లకే లోడ్‌ చేయాల్సి ఉండగా, రాజధాని ప్రాంతంలో 10 టైర్లు, 12 టైర్లు, 14 టైర్ల వాహనాలకు కూడా లోడ్‌ చేసి, ఇతర రాష్ట్రాలకు దర్జాగా ఇసుకను తరలిస్తున్నారు. ఇదిమాత్రం అధికారులు గుర్తించకపోవడం గమనార్హం. ఉచిత ఇసుక పాలసీని ప్రవేశపెట్టగానే రీచ్‌ల సమీపంలోనూ, ప్రధాన రహదారులలో చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు నిర్వహిస్తామని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా ఈ చెక్‌ పోస్టులు కనిపించకపోవడం గమనార్హం.

ఏదో తూతూమంత్రంగా రెవెన్యూ శాఖ అధికారులతో లెక్కలు తీసినంతమాత్రాన దోపిడీ ఆగే పరిస్థితి కనిపించడం లేదు. రెవెన్యూ అధికారులు ఉదయం 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకు లెక్కలు వేస్తున్నారే తప్ప రాత్రి సమయంలో తరలిపోయే లక్షల టన్నుల ఇసుక లెక్కలు ఎలా తీస్తారో స్పష్టత లేదు.

మరిన్ని వార్తలు