జీఎస్‌టీపై ధిక్కార స్వరం

17 Oct, 2016 23:34 IST|Sakshi
జీఎస్‌టీపై ధిక్కార స్వరం
–ఆందోళన బాటపట్టిన వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు
–17న చలో ఢిల్లీ 
–అదే రోజున విధులకు మూకుమ్మడి సెలవులు
తాడేపల్లిగూడెం: గూడ్స్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ (జీఎస్‌టీ) అమలు విషయంలో వాణి జ్య పన్నుల శాఖ ఉద్యోగులు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఈనెల 3వ తేదీ నుంచి వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆ శాఖ ఉద్యోగులు తమ వ్యతిరేకతను 
కేంద్ర ప్రభుత్వానికి వినిపించేందుకు సమాయత్తమవుతున్నారు. ఈనెల 17న చలో ఢిల్లీ పేరిట దేశ రాజధానిలో నిరసన ప్రదర్శన నిర్వహించడంతోపాటు, అదే రోజున జిల్లాలోని వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయాల్లోని ఉద్యోగులంతా మూకుమ్మడి సెలవు పెట్టాలని నిర్ణయించారు. 
ఉనికికే ప్రశ్నార్థకమంటున్న ఉద్యోగులు
జీఎస్‌టీ అమలు విషయంలో తీసుకుంటున్న తాజా నిర్ణయాలు రాష్ట్రాల స్వాతంత్య్రానికి భంగం కలిగించే విధంగా, వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల భవిష్యత్‌కు పాతరేసే విధంగా ఉన్నాయని ఆ శాఖ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. సెంట్రల్‌ ఎక్సైజ్, కస్టమ్స్‌ విభాగం ఉద్యోగులు యూనిఫామ్‌ వేసుకుని విధులు నిర్వర్తిస్తారు.  వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు సాధారణ దుస్తుల్లోనే విధులు నిర్వర్తిస్తారు. కొత్త జీఎస్టీ విధానం అమలు చేస్తే తామంతా యూనిఫామ్‌ డ్యూటీ చేసే ఉద్యోగుల కింద పని చేయాలా లేక తమకూ యూనిఫామ్‌ విధానం ప్రవేశ పెడతారా అనే మీమాంస ఉద్యోగుల్లో నెలకొంది. జీఎస్‌టీ చట్టంగా మారుతున్న తరుణంలో జీఎస్‌టీ కౌన్సిల్‌ తీసుకునే నిర్ణయాలు వాణిజ్య పన్నుల శాఖ ఉనికి, ఆ శాఖలో పనిచేసే ఉద్యోగుల భద్రతకు ముప్పుగా పరిణమిస్తాయనే చర్చ సాగుతోంది. జీఎస్‌టీ అమల్లోకి వస్తే పన్నుల విధానంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటాయి. దీంతోపాటు సర్వీస్‌ ట్యాక్స్‌ వసూలు అంశం కేంద్రం చేతిలోకి వెళుతుందనే బెంగ వారిలో మొదలైంది. సెంట్రల్‌ ఎక్సైజ్, కస్టమ్స్‌ వసూళ్లతో పోల్చుకుంటే సర్వీస్‌ ట్యాక్స్‌ వసూళ్లను తక్కువ చూపించే ప్రమాదం ఉంటుందనేది ఉద్యోగుల వాదన. వసూళ్లు తగ్గాయనే కారణంతో వాణిజ్య పన్నుల శాఖను చిన్నచూపు చూసినా.. ఈ కారణంతో ఉద్యోగులను కుదించాలనే ఆలోచన చేసినా వారి మనుగడ ప్రశ్నార్థకం అవుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఆ శాఖకు చెందిన ఉద్యోగ సంఘాలు ఆందోళన బాట పట్టాయి. జిల్లాలో ఉన్న 9 సీటీవో సర్కిల్స్‌ పరిధిలో ఉన్న డెప్యూటీ కమిషనర్, అసిస్టెంట్‌ కమిషనర్‌ సహా 300 మంది ఉద్యోగులు ఈనెల 3వ తేదీ నుంచి భోజన విరామ సమయంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భవిష్యత్‌ ఆందోళనలకు సిద్ధమవుతున్నారు.
‘నిరసన తప్పదు’
రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసే సర్వీస్‌ ట్యాక్స్, రూ.కోటిన్నరకు పైగా ఉన్న టర్నోవర్‌ టాక్స్‌ చెల్లింపుదారుల నుంచి పన్నుల వసూలును కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులే నిర్వహిస్తారని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో నిరసన కార్యక్రమాలకు దిగక తప్పలేదని ఏపీ కమర్షియల్‌ ట్యాక్సెస్‌ నాన్‌ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ఏలూరు డివిజన్‌ అధ్యక్షుడు ఎస్‌.రవిశంకర్‌ చెప్పారు. జీఎస్‌టీ కౌన్సిల్‌ ప్రతిపాదనల వల్ల సర్వీస్‌ ట్యాక్స్‌ విధానంతోపాటు రాష్ట్రాల్లో వాణిజ్య పన్నుల విధానంలోనూ మార్పులు వస్తాయని, ఈ కారణంగానే నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. టర్నోవర్‌ ట్యాక్స్‌ వసూలు చేసే బాధ్యతను కేంద్రం తీసుకోవడం వల్ల రాష్ట్రంలోని వాణిజ్య పన్ను ల ఉద్యోగులకు పనిలేకుండా పోతుందన్నారు. మరోవైపు రాష్ట్రాలకు సర్వీస్‌ ట్యాక్స్‌ ఆదాయం దక్కకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 
 
మరిన్ని వార్తలు