‘ఛాయ్’ సేవలు అభినందనీయం

27 Apr, 2016 04:45 IST|Sakshi

రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రేమండ్ పీటర్
ప్రత్యూష ఉపశాంతి రక్షణ కేంద్రం ప్రారంభం

శామీర్‌పేట్  : ప్రాణాంతకమైన రోగాల బారిన పడి చివరి దశలో ఉన్న వారికి ఛాయ్ (క్యాథలిక్ హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో ప్రత్యూష ఏ హోలిస్టిక్ పాలెటివ్ కేర్ (ప్రత్యూష ఉపశాంతి రక్షణ కేంద్రం) ఏర్పాటు చేయడం అభినందనీయమని రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రేమండ్ పీటర్ అన్నారు. మంగళవారం ఆయన మండలంలోని దేవరయాంజాల్ గ్రామపరిధిలోని 50 పడకల సామర్థ్యం గల ప్రత్యేక ఆస్పత్రిని మంగళవారం క్యాన్సర్ రోగి తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. క్యాన్సర్, హెచ్‌ఐవీ, ఎయిడ్స్ లాంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడి చివరి రోజుల్లో వారికి కాస్త అయినా మనోధైర్యాన్ని కల్గించే విధంగా సిబ్బంది వారికి చేయూ త అందించాలని కోరారు. ఇలాంటి ఆస్పత్రిని ప్రారంభించిన ఛాయ్ సంస్థ ప్రతి ఒక్కరికీ ఆదర్శమన్నారు. ఈ సెంటర్‌లో నామమాత్రపు రుసుంతో మెరుగైన వైద్యసేవలందించేందుకు కృషి చేస్తున్నట్లు ఛాయ్ డెరైక్టర్ పాదర్ టోమీ థామస్ అన్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాలో ఇలాంటి కేంద్రాలు ఏర్పాటు చే సి రోగులకు సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు.

ఈ సెంటర్‌లో ఇద్దరు వైద్యులు, ఐదుగురు సిస్టర్లు, 2 కౌన్సెలర్లు, ఒక కమ్యూనిటీ కోఆర్డినేటరు కలిసి 24 గంటల పాటు రోగులను కంటికి రెప్పలా కాపాడతారన్నారు. అనంతరం చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్చ్ బిషప్ ప్రకాశ్ మల్లవరపు, ఛాయ్ బోర్డు చైర్మన్ సిస్టర్ దీనా, డెరైక్టర్లు పాదర్ మాథ్యూ ఇబ్రహీం, స్పెషలిస్టు స్పోక్ పర్సన్ డాక్టర్ ఎల్ గాయత్రి, పాదర్ అర్భుతం, డాక్టర్ భరత్, రమేశ్, సుందర్, వెంకటగోపాల్, కృష్ణ, ఇలియాన్, దేవరయాంజల్ ఎంపీటీసీ జైపాల్‌రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు