ఘనంగా ముత్యాలమ్మ జాతర

29 Aug, 2016 20:45 IST|Sakshi
ఘనంగా ముత్యాలమ్మ జాతర
హుజూర్‌నగర్‌ : శ్రావణమాసంలో ప్రతి ఏటా పట్టణంలో రెండు రోజులపాటు నిర్వహించే ముత్యాలమ్మ జాతర సోమవారంతో ముగిసింది. ఈ సందర్భంగా స్థానిక పీర్లకొట్టం వీధి సమీపంలోని మూడుగుళ్ల ముత్యాలమ్మ దేవాలయానికి భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించి దర్శనం చేసుకున్నారు. అదేవిధంగా మహిళలు అమ్మవారికి చీరెలు, గాజులు, పసుపు కుంకుమలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం పట్టణంలో వందలాదిగా ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లపై ప్రభలు కట్టి డప్పువాయిద్యాల మధ్య యువకులు నృత్యాలు చేస్తూ, కేరింతలు కొడుతూ వీధుల్లో ఊరేగింపు నిర్వహించిన అనంతరం ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయం చుట్టూ ప్రభ బండ్లు ప్రదక్షిణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని వివిధ స్వచ్చంద సంస్థల ఆధ్వర్యంలో స్థానిక మూడుగుళ్ల ముత్యాలమ్మ ఆలయం వద్ద భక్తులకు మంచినీరు సరఫరా చేశారు.  ముత్యాలమ్మ జాతర సందర్భంగా పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హుజూర్‌నగర్‌ సీఐ నర్సింహారెడ్డి, ఎస్‌ఐ రంజిత్‌రెడ్డిల ఆధ్వర్యంలో పటిష్ట పోలీస్‌ బందోబస్తును  ఏర్పాటు చేశారు.
 
మరిన్ని వార్తలు