సస్యరక్షణకు సమయమిదే!

7 Dec, 2016 23:06 IST|Sakshi
సస్యరక్షణకు సమయమిదే!

అనంతపురం అగ్రికల్చర్‌ : రబీలో వేసిన వేరుశనగకు అక్కడక్కడా ఆకుముడుత పురుగు ఆశించినందున సస్యరక్షణ చర్యలు చేపట్టాలని రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ బి.సహదేవరెడ్డి తెలిపారు. అలాగే వాతావరణానికి అనుగుణంగా కంది, పత్తి, వరి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పడంతోపాటు కోళ్లు, గొర్రెల పెంపకందారులకూ కొన్ని సూచనలు చేశారు.

- రబీ పంటగా నీటి వసతి కింద సాగు చేసిన వేరుశనగకు అక్కడక్కడా ఆకుముడుత తెగులు కనిపిస్తోంది. దీని నివారణకు ఎకరాకు 400 మిల్లీలీటర్ల క్వినాల్‌ఫాస్‌ లేదా 320 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్‌ లేదా 500 మిల్లీలీటర్ల క్లోరోఫైరిపాస్‌ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.
- ఈ నెల 20వ తేదీలోగా రబీ వేరుశనగ సాగు చేసుకోవాలి. 3 గ్రాముల మాంకోజెబ్‌ + 2 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్‌ కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి. దీనివల్ల విత్తనం, భూమి ద్వారా వచ్చే చీడపీడలు, తెగుళ్లను అరికట్టవచ్చు. ఎకరాకు 18 కిలోల యూరియా, 100 కిలోల సింగిల్‌ సూపర్‌ఫాస్పేట్‌ ఆఖరి దుక్కిలో వేసుకోవాలి.
- కందిలో శనగపచ్చ పురుగు ఆశించినందున పూత, కాయ దశల్లో ఉన్న పంటకు 2 మి.లీ. క్వినాల్‌ఫాస్‌ లేదా 1.5 మి.లీ. అసిఫేట్‌ లీటర్‌ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే మారుకామచ్చల పురుగు నివారణకు 2.5 మి.లీ. క్లోరోఫైరిపాస్‌ లేదా 1 గ్రాము అసిఫేట్‌ లేదా 1 గ్రాము థయోడికార్బ్‌ లేదా 0.75 మి.లీ. నొవాల్యురాన్‌ లేదా 0.2 మి.లీ. స్పైనోసాడ్‌ లీటర్‌ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అవకాశం ఉంటే నీటి తడులు ఇచ్చుకోవాలి.
- పత్తిలో గులాబీరంగు కాయతొలచు పురుగు ఆశించిన ప్రాంతాల్లో ఎకరాకు నాలుగు నుంచి 6 ఫిరమోన్‌ ఎరలు ఏర్పాటు చేసుకుని పురుగు ఉనికి, ఉధృతిని గమనించాలి. నివారణకు 2 మి.లీ. ప్రొపికొనజోల్‌ కానీ, 1.5 గ్రాముల లార్విన్‌ కానీ 2 మి.లీ. క్లోరోఫైరిపాస్‌ కానీ ఏదో ఒకటి తీసుకుని దానికి 1 మి.లీ.నువాన్‌ను జత చేసి లీటర్‌ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
- వరిలో సుడిదోమ నివారణకు 1.6 మి.లీ. బుప్రోపెజిన్‌ లేదా 2 మి.లీ. ఇథోఫెన్‌ఫ్రోక్స్‌ లేదా 1.5 గ్రాముల అసిఫేట్‌ లేదా ఇమిడాక్లోప్రిడ్‌కు 0.25 గ్రాములు ఎథిప్రోల్‌ను జత చేసి లీటర్‌ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
- ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గినందున కోళ్ల ఫారాలలో ఇన్ఫ్రారెడ్‌ బల్బులు లేదా కృత్రిమ ఇంక్యుబేటర్ల ద్వారా ఉష్ణోగ్రతలను నియంత్రించుకోవాలి. కోళ్ల పెంటను అమ్మోనియా వాసన లేకుండా ఎప్పటికప్పుడు తీసివేస్తుండాలి.
- ప్రస్తుత వాతావరణంలో గొర్రెల్లో నీలినాలుక (బ్లూటంగ్‌) వ్యాధి వచ్చే ప్రమాదం ఉన్నందున ముందస్తుగా టీకాలు వేయించుకోవాలి.

వాతావరణం పొడిగా ఉంటుంది
వచ్చే మూడు రోజులు జిల్లాలో వాతావరణం పొడిగా ఉంటుంది. హైదరాబాద్‌ వాతావరణ శాఖ అందించిన సమాచారం మేరకు ఈ నెల 11వ తేదీ వరకు ఎలాంటి వర్షసూచనా లేదు. పగటి ఉష్ణోగ్రతలు 30 నుంచి 33 డిగ్రీల వరకు, రాత్రిళ్లు 19 నుంచి 21 డిగ్రీల వరకు నమోదు కావచ్చు. గాలిలో తేమ ఉదయం 55 నుంచి 80 శాతం, మధ్యాహ్నం 32 నుంచి 44 శాతం మధ్య ఉండవచ్చు. గంటకు 4 నుంచి 6 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు