'రిషితేశ్వరి' నిందితులకు బెయిల్ నిరాకరణ

10 Aug, 2015 18:15 IST|Sakshi
'రిషితేశ్వరి' నిందితులకు బెయిల్ నిరాకరణ

గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ విద్యార్థి ఎం.రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. వారు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను 1వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు సోమవారం కొట్టివేసింది. ఈ కేసులో దుంప హనీషా, జయచరణ్, నరాల శ్రీనివాస్ నిందితులుగా ఉన్న విషయం విదితమే.  A1గా సీనియర్ విద్యార్థిని హనీషా, A2గా జయచరణ్, A3గా శ్రీనివాస్ పేర్లను పోలీసులు నమోదు చేశారు.

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో చోటుచేసుకున్న అమానవీయ సంఘటనల ఫలితంగా తీవ్ర అవమాన భారంతో ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్యకు పాల్పడిందని ఏపీ ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ వెల్లడించింది. రిటైర్డ్ ఐఏఎస్ బాలసుబ్రహ్మణ్యం నేతృత్వంలో ఏర్పాటైన విచారణ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన సంగతి తెలిసిందే.

రిషితేశ్వరి ఆత్మహత్యకు ఆర్కిటెక్చర్ కాలేజీ ప్రిన్సిపాల్ బాబూరావు కూడా కారణమని కమిటీ నివేదికలో స్పష్టం చేసింది. ఆయన అండదండలతో వర్సిటీలో అరాచకాలు యథేచ్ఛగా సాగుతున్నట్లు నివేదికలో వివరించింది. కాలేజీలోనే అమ్మాయిలు, అబ్బాయిలు కలసి మందుపార్టీలు చేసుకుంటున్నారని పేర్కొంది.

ప్రిన్సిపాల్ ప్రవర్తన  సరిగా లేదని, ఆయనఅండతో కాలేజీలో మద్యం ప్రవహిస్తోందని వివరిం చింది. రిషితేశ్వరిని లై ంగిక వేధింపులకు గురి చేశారని, రిషితేశ్వరి ఫొటోలు తీసి ప్రచారం చేశారని, ఇవన్నీ ప్రిన్సిపాల్ అండతోనే సాగాయని తెలిపింది. ర్యాగింగ్, లైంగిక వేధింపులతో రిషితేశ్వరి మానసికంగా కుంగిపోయిందని, అవే కారణాలు ఆమె ఆత్మహత్యకు దారితీశాయని వివరించింది.

మరిన్ని వార్తలు