పెరిగిపోతున్న గిరిజన రైతుల ఆత్మహత్యలు

9 Aug, 2016 19:46 IST|Sakshi
ప్రభుత్వ సహాయ నిరాకరణతో రాష్ట్రంలో గిరిజన రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని లంబాడా హక్కులభేరి రాష్ట్ర కార్వనిర్వాహక అధ్యక్షుడు చంద్రానాయక్ ఆరోపించారు. గుంటూరులో మంగళవారం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆదివాసీ గిరిజన దినోత్సవ సభలో ప్రజాప్రతినిధుల ఎదుట గిరిజనులకు జరుగుతున్న అన్యాయాలను వెళ్లగక్కారు. రాష్ట్రంలో ఎస్సీల కంటే ఎస్టీలు ఎంతో వెనుకబడిఉన్నారని, ఫీజు రీయింబర్స్‌మెంట్ మంజూరులోనూ ఎస్టీ విద్యార్థులు అన్యాయానికి గురవుతున్నారన్నారు. ప్రభుత్వ నిరాదరణ కారణంగా గిరిజనులు దీనావస్థలో మగ్గుతుండగా, ప్రాజెక్టుల నిర్మాణంతో నిర్వాసితులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
 
ప్రభుత్వం గిరిజనుల సంక్షేమం కోసం అమలు చేస్తున్నామని చెబుతున్న పథకాల ఫలాలు గిరిజనులకు చేరనీయకుండా దళారులే లబ్ధి పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన తండాల్లో తాగునీటి సదుపాయం, పిల్లలను చదివించేందుకు పాఠశాలలు లేక, కనీస సదుపాయాలకు నోచుకోని దుర్భర పరిస్థితుల్లో గిరిజనులు మగ్గుతున్నారన్నారు. రాష్ట్రంలో తమ సామాజికవర్గం నుంచి ఒక్క మంత్రి కూడా లేరని, నామినేటెడ్ పదవుల్లోనూ గిరిజనులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనులకు సముచిత స్థానం కల్పించకుండా దినోత్సవాలు నిర్వహించడం వలన ప్రయోజనం శూన్యమని ఆరోపించారు. సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్ షేక్ జానీమూన్, టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల రెడ్డి, ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ, అధికారులు పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు