అంగరంగ వైభవంగా శ్రీవారి పున్నమి గరుడ సేవ

20 Jun, 2016 22:33 IST|Sakshi

తిరుమల: తిరుమలలో సోమవారం పున్నమి గరుడ వాహన సేవ వైభవంగా సాగింది. సంప్రదాయబద్దంగా పౌర్ణమి సందర్భంగా ఆలయ పురవీధుల్లో మలయప్ప గరుడవాహనంపై దర్శనమివ్వడం ఆనవాయితీ. సాయం సంధ్యా సమయం పూజలు ముగించుకుని శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప కొలువు మండపానికి వేంచేశారు. సహస్రదీపాలంకరణసేవలో భక్తులకు దర్శనమిచ్చారు. గరుడ వాహనంపై ఆశీనులైన మలయప్పస్వామిని అర్చకులు ఆభరణాలు, సుగంధ సువాసనలు వెదజల్లే పుష్పాలతో అలంకరించారు.

రాత్రి 7గంటలకు భక్తుల గోవింద నామస్మరణలు, వేద మంత్రాల నడుమ వాహన సేవ ఊరేగింపు ప్రారంభించారు. ఆలయ వీధుల్లో ఊరేగుతూ స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ద్రవిడ వేద నాలాయర దివ్యప్రబంధ పారాయణ పథకంలోని సుమారు 200 మంది పారాయణదారులు దివ్యప్రబంధ పాశురాలు పారాయణం చేశారు. ఈ కార్యక్రమాన్ని తొలిసారి ఏర్పాటుచేశామని టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు తెలిపారు. భవిష్యత్‌లో ప్రతి నెలా పౌర్ణమికి ఇలాంటి వైదిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు.
 

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా