'ఓ శాడిస్ట్ ను పెట్టి కక్ష సాధిస్తున్నారు'

17 Aug, 2015 02:05 IST|Sakshi
'ఓ శాడిస్ట్ ను పెట్టి కక్ష సాధిస్తున్నారు'

నగరి ఘటనలపై రోజా ఆగ్రహం
* టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు ఎన్ని దౌర్జన్యాలు చేసినా చర్యలు తీసుకోరు
* అదే వైఎస్సార్‌సీపీ నేతలు ఏమీ చేయకున్నా కేసుల్లో ఇరికిస్తున్నారు

సాక్షి, హైదరాబాద్: చంద్రబాబునాయుడు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను గట్టిగా నిలదీస్తున్నామనే కక్షతోనే ప్రతిపక్ష నేతలైన తమపై దౌర్జన్యాలు చేస్తున్నారని, అధికారాన్ని, పోలీసుల్ని అడ్డం పెట్టుకుని కేసులు పెడుతున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు ఆర్.కె.రోజా ధ్వజమెత్తారు.

ఆమె ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. చిత్తూరు జిల్లా నగరి మున్సిపల్ కమిషనర్‌పై దాడి జరక్కపోయినా, జరిగినట్లుగా చిత్రీకరించి తామందరినీ కేసుల్లో ఇరికించారని ఆగ్రహం వెలిబుచ్చారు. చంద్రబాబు పాలనలో ఎవరికీ రక్షణ లేకుండా పోయిందని, ముఖ్యంగా మహిళలకు అసలు భద్రత లేదని విమర్శించారు. ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు.. ఆ వ్యవహారాన్ని ప్రశ్నిస్తే హైదరాబాద్‌లో సెక్షన్-8 అమలు చేయాలని గగ్గోలు పెడుతున్నారని, కానీ సెక్షన్-8ను అమలు చేయాల్సింది హైదరాబాద్‌లో కాదని, ఆంధ్రప్రదేశ్‌లో అమలుచేయాలని ఆమె అన్నారు.

టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు ఎన్ని దౌర్జన్యాలు చేసినా చర్యలు తీసుకోరు, అరెస్టులు చేయరు కానీ వైఎస్సార్‌సీపీ నేతలు ఏమీ చేయకపోయినా కేసుల్లో ఇరికిస్తారని దుయ్యబట్టారు.
 
గాలి అండతో నగరి కమిషనర్ ఆగడాలు..

నగరి కమిషనర్ పై దౌర్జన్యం చేశామనడం సరికాదని, ఈ ఘటనను ఖండించిన జిల్లా కలెక్టర్ ముందుగా అక్కడేం జరిగిందో తెలుసుకోవాలని రోజా కోరారు. నగరి మున్సిపల్ చైర్మన్ పదవిని వైఎస్సార్‌సీపీ అధిష్టించి పట్టణంలో మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రతిష్టను పెంచుకుంటూ ఉంటే.. టీడీపీ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు  కావాలనే ము న్సిపల్ కమిషనర్ స్థాయిలేని మూడో కేటగిరీకి చెందిన వ్యక్తిని అక్కడ నియమింపజేశారని తెలిపారు. ఈ కమిషనర్ తననుగానీ,  చైర్‌పర్సన్‌నుగానీ ఖాతరు చేయకుండా  వ్యవహరిస్తున్నారన్నారు.

మరిన్ని వార్తలు