హాహాకారాలు..ఆర్తనాదాలు!

1 Feb, 2017 00:31 IST|Sakshi
హాహాకారాలు..ఆర్తనాదాలు!
- ఓర్వకల్లు వద్ద రోడ్డు ప్రమాదం
- లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు  
- పదిమందికి తీవ్ర గాయాలు 
- లారీలో ఇరుక్కుపోయిన డ్రైవర్‌
- అతికష్టం మీద బయటకు తీసిన స్థానికులు
 
ఓర్వకల్లు : నిత్యం రద్దీగా ఉండే జాతీయ రహదారి.. మంగళవారం ఉదయం పదిగంటల సమయంలో శబ్దం..రక్షించండి అంటూ హాహాకారాలు..ఆర్తనాదాలు.. వెంటనే స్పందించిన స్థానికులు, పోలీసులు..గ్యాస్‌ కట్టర్ల సాయంతో క్షతగాత్రులను బయటకు తీశారు. కర్నూలు–చిత్తూరు 18వ నంబర్‌ జాతీయ రహదారిపై ఓర్వకల్లు వద్ద లారీని బస్సు ఢీకొన్న ఘటనలో పదిమంది గాయపడ్డారు. కడప డిపోకు చెందిన ఏపీ04 టీయు 5995 నంబర్‌ గల ఆర్టీసీ అద్దె బస్సు ఉదయం 6 గంటలకు కడప నుంచి కర్నూలుకు బయలుదేరింది.  ఓర్వకల్లు ఆర్టీసీ బస్టాండ్‌ ఎదురుగా గల ఫ్లై ఓవర్‌ వంతెనపై నిలబడిన ఆటోను తప్పించబోయి ఎదురుగా వస్తున్న హర్యానాకు చెందిన హెచ్‌ఆర్‌55 డబ్ల్యూ 2412 నంబర్‌ గల లారీని ఢీకొంది. దీంతో లారీ ముందు భాగం దెబ్బతిని లారీడ్రైవర్‌ బుచ్చిబాబు రెండు కాళ్లు స్టీరింగ్‌ కింద ఇరుక్కుపోయాయి.
 
బస్సులో ప్రయాణిస్తున్న డ్రైవర్‌ పెంచలయ్య, కండక్టర్‌ రామచంద్రారెడ్డితో పాటు ప్రయాణికులు రమేష్, రామకృష్ణ నాయక్, సంపత్‌కుమార్, శ్రీనివాసులు, విజయ్‌కుమార్, మహిమూన్, షహినాబి రక్తగాయాలకు గురయ్యారు. ఘటన జరిగిన వెంటనే స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని క్షతగాత్రులను 108 వాహనంలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు..స్థానికుల చేత లారీలో ఇరుక్కుకపోయిన డ్రైవర్‌ను గడ్డపారలు, గ్యాస్‌ కట్టర్‌లతో అతికష్టం మీద బయటకు తీశారు.  డ్రైవర్‌ బుచ్చిబాబు గంటసేపు నరకయాతన అనుభవించాడు. ఈలోగా కర్నూలు తాలూకా సీఐ నాగరాజు యాదవ్, ఎస్‌ఐ చంద్రబాబు నాయుడు, ఉలిందకొండ, నాగలాపురం ఎస్‌ఐలు వెంకటేశ్వరరావు, మల్లికార్జున ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని పోలీసులు తెలిపారు. 
 
కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతోనే ప్రమాదాలు... 
రోడ్డు నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు ఆరోపించారు. ఐదేళ్ల నుంచి కొనసాగుతున్న రహదారి విస్తరణ పనుల్లో భాగంగా సంబంధిత కాంట్రాక్టర్లు, ఇంజనీరింగ్‌ అధికారులు ఇష్టానుసారంగా రోడ్డు మలుపులు ఏర్పాటు చేస్తుండగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. 
 
మరిన్ని వార్తలు