శుభలేఖలిచ్చి వస్తూ.. పెళ్లికొడుకు దుర్మరణం

28 Jan, 2017 00:37 IST|Sakshi
శుభలేఖలిచ్చి వస్తూ.. పెళ్లికొడుకు దుర్మరణం
మార్టేరు, (పెనుమంట్ర) : శుభలేఖలిచ్చి వస్తూ.. ఓ కొత్త పెళ్లికొడుకు దుర్మరణం పాలయ్యాడు. శుక్రవారం రాత్రి మార్టేరు గ్రామ శివారున జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం..మార్టేరుకు చెందిన చీమకుర్తి నూక రత్నకుమారి పెద్ద కుమారుడు పూర్ణ వెంకట రామరాజు(27) పెళ్లి ఫిబ్రవరి 1న జరగనుంది. దీంతో ఆమె రామరాజుతో కలిసి శుభలేఖలు ఇచ్చేందుకు ద్విచక్రవాహనంపై ఆచంట వెళ్లి తిరిగి వస్తుండగా  మార్టేరు శివారున ఎదురుగా వస్తున్న మరో మోటారు సైకిల్‌ బలంగా ఢీకొట్టింది. దీంతో రామరాజు అక్కడికక్కడే మరణించాడు. రత్నకుమారితోపాటు, మరో మోటార్‌సైకిల్‌పై ఉన్న కర్రి ప్రతాప్‌ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రత్నకుమారి పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలంలో రామరాజు తమ్ముడు శివ కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నాడు.  రామరాజు మోటార్‌సైకిల్‌ ఢీకొన్న మరో బైక్‌పై ముగ్గురు యువకులు అతివేగంగా రావడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. వీరిలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడగా, మరో ఇద్దరి యువకుల జాడ తెలియాల్సి ఉంది. ప్రతాప్‌ను కూడా మెరుగైన చికిత్స నిమిత్తం భీమవరం తరలించినట్టు సమాచారం.  మృతుడు రాజు కొన్నాళ్లపాటు దుబాయ్‌లో ఉండి వచ్చాడు. అతని తల్లి రత్నకుమారి మార్టేరులో కిరాణాషాపు నడుపుతున్నారు. 
 
మరిన్ని వార్తలు