అర్ధరాత్రి వేళ.. మృత్యుహేల

9 Aug, 2016 22:39 IST|Sakshi
చెట్టును ఢీకొట్టిన క్రూసర్‌ వాహనం
  • కిచ్చన్నపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
  • నలుగురు దుర్మరణం.. 10 మందికి తీవ్ర గాయాలు
  • క్షతగాత్రులను సంగారెడ్డి, హైదరాబాద్‌కు తరలింపు
  • మృతులంతా మహారాష్ట్రకు చెందిన వారే
  • జోగిపేట: రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందిన ఘటన అందోలు మండలం కిచ్చన్నపల్లి గ్రామ సమీపంలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. మృతులంతా మహారాష్ట్రకు చెందిన వారు. వివరాలిలా ఉన్నాయి.  నాందేడ్‌ జిల్లా ముఖేడ్‌ తాలూకా దొన్‌గెడ్,  వాడీ, షీకాద, సోన్‌పేట గ్రామాలకు చెందిన రెండు కుటుంబాలు సోమవారం సాయంత్రం చిత్తూరు జిల్లాలోని తిరుమలకు క్రూసర్‌ వాహనంలో బయలుదేరారు.

    ఈ ప్రమాదంలో మృతి చెందిన లక్ష్మిబాయికి గత సంవత్సరం ఏఎన్‌ఎంగా ఉద్యోగం రావడంతో పాటు దిలీప్, ఉజ్వలల కొడుకు తల వెంట్రుకలు తీయాలన్న మొక్కును తీర్చుకునేందుకే వీరు తీర్థయాత్రలకు బయలుదేరినట్లు సమాచారం. కిచ్చన్నపల్లి గ్రామ బస్జేజీ సమీపంలో ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి నాందేడ్‌ అకోలా జాతీయ రహదారి పక్కనే ఉన్న పెద్ద మర్రిచెట్టును ఢీకొట్టింది.

    దీంతో అందులో ప్రయాణిస్తున్న పులియాబాయి (55) భార్య భర్తలైన సంజయ్‌ రాథోడ్‌ (35),  లక్ష్మిబాయి (30 ) అక్కడికక్కడే మృతి చెందారు. పులియాబాయి వెనుక సీటులో నుంచి ముందు సీటులోకి వచ్చి సీట్లమధ్య ఇరుక్కుపోయి మరణించింది. ముందు సీటులో కూర్చున్న సంజయ్‌రాథోడ్‌కు తలకు బలమైన గాయం కావడంతో మృతి చెందాడు. క్రూసర్‌ వాహనం డ్రైవర్‌ నర్సింగ్‌ (40)ను జోగిపేట ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

    పరిస్థితి విషమంగా  ఉండడంతో సంగారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ సంఘటనలో సుమీత్, కవితల కాళ్లు విరిగిపోగా, మాషన్, అక్షర, స్వప్న, విద్య, దిలీప్‌ రాథోడ్‌ల తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఉజ్వల అనే మహిళ చెంపకు గాయం అయ్యింది. ప్రదీప్‌నాయక్, దిలీప్‌ రాథోడ్, మహేదేవ్‌లకు కూడా గాయాలు కావడంతో వారిని సంగారెడ్డి, హైదరాబాద్‌ ఆసుపత్రులకు అంబులెన్స్‌లో తరలించారు.

    ఈ ప్రమాదంలో ఆటో పల్టీకొట్టగా అందులో ప్రయాణిస్తున్న పెద్దాపూర్‌ గ్రామానికి చెందిన కిష్టాగౌడ్‌కు గాయాలు కాగా, డ్రైవర్‌ తప్పించుకొని పారిపోయాడు. సంఘటన స్థలాన్ని సీఐ వెంకటయ్య, ఎస్‌ఐ శ్రీధర్, పోలీసు సిబ్బందితో సందర్శించి సహాయక చర్యలు చేపట్టారు. ఉజ్వల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ టి.శ్రీధర్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు