అంత‌లోనే విషాదం

15 May, 2017 23:27 IST|Sakshi
అంత‌లోనే విషాదం
గవరయ్య కోనేరు వద్ద అర్ధరాత్రి ఆర్తనాదాలు
రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త, కుమారుడికి తీవ్ర గాయాలు
 
జాతీయ రహదారిలోని గవరయ్య కోనేరు వద్ద పెట్టి మట్టి పీపాలు.. వాహనాల వేగ నిరోధం మాటేలా ఉన్నా.. ఆ ప్రాంతం అందరిని హడలెత్తించింది. ఆదివారం అర్ధరాత్రి ఆ ప్రాంతంలో బైక్‌ను ఒక లారీ ఢీకొనడంతో భార్య మృతి చెందగా, భర్త, కుమారుడి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వీరిని ఆస్పత్రికి తరలించేందుకు ఆ ప్రాంతంలో సిద్ధం చేసిన వాహనాన్ని.. మరో లారీ ఢీకొంది. దీంతో హతాశులైన పోలీసులు రెండు లారీలను సీజ్‌ చేశారు.
 
తుని రూరల్‌ (తుని) :  మండలంలోని గవరయ్యకోనేరు వద్ద జాతీయ రహదారిపై అర్థరాత్రి ఆర్తనాదాలు మిన్నంటాయి. మండలంలోని కుమ్మరిలోవకు చెందిన నల్లల శేషగిరి, అతని భార్య నాగలక్ష్మి, కుమారుడు శ్యాం ఆదివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మోటారుసైకిల్‌పై ఈ ముగ్గురూ ఆదివారం ప్రత్తిపాడు మండలం గోపాలపట్నంలో జరిగిన శుభకార్యానికి వెళ్లొస్తుండగా గవరయ్యకోనేరు వద్ద ప్రమాదానికి గురయ్యారు. మరో పది కిలోమీటర్లు ప్రయాణిస్తే వారు గమ్యానికి చేరుకునేవారే. వేగ నిరోధానికి పోలీసులు ఏర్పాటు చేసిన మట్టి పీపాల వద్ద మోటారు సైకిల్‌ను లారీ ఢీకొంది. బైక్‌ పైనుంచి కింద పడిన నాగలక్ష్మి మెడ, శేషగిరి కాళ్లపై నుంచి లారీ దూసుకుపోయింది. దీంతో నాగలక్ష్మి (28) అక్కడికక్కడే మృతి చెందగా శేషగిరి, శ్యాం తీవ్రంగా గాయపడ్డారు. దూరంగా పడిన బాలుడు శ్యాం రక్షించండి అంటూ కేకలు వేయడంతో డ్రైవర్లు వాహనాలను ఆపి పోలీసులకు, 108 అంబులెన్సుకు సమాచారం అందించారు. రోడ్డు మధ్యనే ప్రమాదం జరగడంతో అన్నవరం నుంచి తుని వైపు వచ్చే వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌ స్థంభించింది. సమాచారం తెలియగానే పోలీసులు హుటాహుటీన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రూరల్‌ ఎస్సై ఎం.అశోక్, పోలీసులు క్షతగాత్రులను తుని ఏరియా ఆస్పత్రికి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం శేషగిరి, శ్యాంలను విశాఖపట్నంలో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.  క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించేందుకు ఎన్‌హెచ్‌ 16 నిర్వాహకులకు చెందిన బొలోరాలో ఎక్కిస్తుండగా మరో ట్యాంకర్‌ లారీ ఢీకొంది. ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు. దీంతో ఈ రెండు లారీలను రూరల్‌ పోలీసులు సీజ్‌ చేశారు. రూరల్‌ సీఐ జి.చెన్నకేశవరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి ప్రధాన కారణం జాతీయ రహదారిపై పీపాలను ఏర్పాటు చేయడమేని వాహనదారులు అంటున్నారు. 
మరిన్ని వార్తలు