విషాదంలోనూ వికసించిన దాతృత్వం

4 May, 2016 22:10 IST|Sakshi
విషాదంలోనూ వికసించిన దాతృత్వం

 పత్తిపాడు/కిర్లంపూడి : వివాహం జరిగి కొన్ని ఘడియలే అయ్యాయి. మంగళ వాయిద్యాలు ఇంకా చెవుల్లోనే మారుమోగుతున్నాయి. ఆ ఆనందానుభూతులు నెమరువేసుకుంటూ బయలుదేరిన పెళ్లి బృందంపై మృత్యువు విరుచుకుపడింది. హాహాకారులు చేస్తూ.. వారంతా తేరుకునేలోగానే.. ఘోరం జరిగిపోయింది. సంఘటన స్థలంలోనే ఇద్దరు మరణించగా, ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు చనిపోవడంతో ఆ పెళ్లింట తీవ్ర విషాదం అలముకుంది. జాతీయ రహదారిలో ప్రత్తిపాడు వద్ద మంగళవారం జరిగిన దుర్ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
 
 కిర్లంపూడి మండలం వేలంక గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ కండెల్ల రాజబ్బాయి(60)కి నలుగురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. మూడో కుమార్తె గౌరి వివాహం గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామంలో మంగళవారం ఉదయం జరిగింది. ఈ వివాహానికి 13 మంది మినీ వ్యాన్‌లో కొడవలి వెళ్లారు. వివాహ తంతు ముగిశాక విందు ఆరగించి, సాయంత్రం స్వగ్రామానికి బయలుదేరారు. రాచపల్లి అడ్డ రోడ్డు జంక్షన్ సమీపంలో రాంగ్ రూట్‌లో కలప లోడుతో వస్తున్న ట్రాక్టర్‌ను మినీ వ్యాన్ ఢీకొంది. వాహనంలో చిక్కుకుని రాజబ్బాయి, బలసా సూర్యకాంతం (55) మరణించారు. ఆస్పత్రికి తరలిస్తుండగా బలసా ధర్మరాజు (65), రాజబ్బాయి రెండో కుమార్తె చినతల్లి కుమారుడు రాజాల రాజబాబు(బాలు)(14) చనిపోయారు.
 
 ఈ సంఘటనలో గాయపడిన మేడపాడుకు చెందిన తండ్రీకొడుకులు రాయి కాశీ, సాయి మణికంఠ, వేలంక గ్రామానికి చెందిన కండెల్ల సన్యాసమ్మ, విజయకుమారి, నీలాంజలి, ఏడిద భూషణం, మినీవ్యాన్ డ్రైవర్ బచ్చల సూరిబాబును ప్రత్తిపాడు సీహెచ్‌సీకి, వేమగిరి రాణి, చిక్కాల వేగులమ్మను స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.వీరిలో చిక్కాల వేగులమ్మ మినహా మిగిలిన వారిని కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం స్థానిక సీహెచ్‌సీకి తరలించారు. ఈ సంఘటనలో ఏడిద ఆషా (15) సురక్షితంగా బయటపడింది.
 
 గంటకు పైగా శ్రమించి..
 వాహనంలో చిక్కుకున్న మృతదేహాలను వెలికితీసేందుకు పోలీసులు గంటకు పైగా శ్రమించాల్సి వచ్చింది. మినీ వ్యాన్ ముందు సీటులో కూర్చున్న రాజబ్బాయి ఉన్న వైపు ట్రాక్టర్‌ను తాకడంతో, వాహనం లోపలికి నొక్కుకుపోయింది. అందులో ఇరుక్కున్న రాజబ్బాయిని ప్రత్తిపాడు ఎస్సై ఎం.నాగదుర్గారావు, స్థానికులు బయటకుతీశారు.
 
 ఒకరిని విడిచి మరొకరు ఉండలేక..
 వృద్ధ దంపతులు చావులోనూ ఒకటయ్యారు. ఈ సంఘటనలో భార్య బలసా సూర్యకాంతం (55) వాహనంలో చిక్కుకుని మరణించగా.. భర్త ధర్మరాజు (65) స్థానిక సీహెచ్‌సీలో మరణించారు. వ్యవసాయ కూలీలైన భార్యాభర్తలకు నలుగురు సంతానం.ముగ్గురు కుమార్తెలకు వివాహాలు కాగా, వివాహితుడైన కుమారుడు ఏడాది క్రితం చనిపోయాడు. కోడలు, మనవడు నంది అబ్బు, మనవరాలు బుల్లి రాఘవను ధర్మరాజు పోషిస్తున్నారు. అబ్బు, రాఘవ కాకినాడలో ఇంటర్మీడియట్ చదువుతున్నారు. ఇంటికి పెద్ద దిక్కు కోల్పోవడంతో ఆ కుటుంబం జీవనాధారం కోల్పోయింది.
 
  కొడుకు మరణించడంతో 
 కన్న కొడుకు మరణించడంతో శోకసంద్రంలో మునిగిన తల్లి.. అంతటి విషాదంలోనూ దాతృత్వాన్ని చూపించింది. ఈ సంఘటనలో మరణించిన రాజబాబు(బాలు) మృతదేహాన్ని చూసేందుకు స్థానిక సీహెచ్‌సీకి వచ్చిన బాలు తల్లి చినతల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. కొడుకునూ, తండ్రి రాజబ్బాయిని కోల్పోయిన ఆమెను ఊరడించడం ఎవరితరం కాలేదు. పుత్ర శోకంతో తల్లిడిల్లుతూనే తన కుమారుడి నేత్రాలను దానం చేయాలని కోరింది. ఆమె దాతృత్వానికి చూపరులు కన్నీటిపర్యంతమయ్యారు.
 

>
మరిన్ని వార్తలు