రోడ్లు, రవాణాకు అధిక ప్రాధాన్యం

22 Aug, 2016 18:23 IST|Sakshi
రోడ్లు, రవాణాకు అధిక ప్రాధాన్యం

ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి

మంతన్‌గౌరెల్లిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన


యాచారం: ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు, ఆర్టీసీ బస్సు సౌకర్యాం కల్పించే విధంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మంతన్‌గౌరెల్లి గ్రామంలో రూ. కోటి నిధులతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి, గిరిజన తండాకు బీటీ బీటీ రోడ్డు నిర్మించడానికి ఎన్ని రూ. కోట్లయినా ఖర్చు చేస్తామని స్పష్టంచేశారు. రోడ్డుతో పాటు అన్ని గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. గిరిజనులు ఆర్థికంగా ఎదగడానికి కృషి చేయాలని సూచించారు. ఎన్ని కష్టాలోచ్చినా పిల్లలను ఉన్నత చదువులు చదివించాలన్నారు. వెనుకబడిన కులాల్లో ఉన్నత చదువుల వల్లే ఉద్యోగాలు పొంది ఆర్థికంగా స్థిరపడే అవకాశం ఉందని చెప్పారు.

     ప్రతిభ ఉన్న నిరుద్యోగ యువతి, యువతులకు ఎంకేఆర్‌ ఫౌండేషన్‌ నుంచి ఉద్యోగాలు సాధించేలా ఉచితంగా శిక్షణ ఇప్పిస్తానన్నారు. ప్రతి గిరిజన తండాకు స్వచ్ఛమైన కృష్ణాజలాలు సరఫరాకు కృషి చేస్తానని అన్నారు. ముందు కాలంలో ఎస్సీ, ఎస్టీ కాలనీల అభివృద్ధే లక్ష్యంగా ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో తాగునీరు, డ్రైనేజీ, వీధిలైట్లు, బీటీ రోడ్ల నిర్మాణం కోసం రూ.100 కోట్ల నిధులు ఖర్చు చేసేలా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏడాది కాలంలోనే రూ.500 కోట్లు ఖర్చు చేసి అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు. వచ్చే మూడేళ్ల కాలంలో మరో వెయ్యి కోట్లు ఖర్చు చేసి వివిధ అభివృద్ధి పనులు చేసి తెలంగాణాలోనే ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు.

సోమన్న ఆలయంలో ఎమ్మెల్యే పూజలు...
మాల్‌ - మంతన్‌గౌరెల్లి గ్రామాల మధ్య ఉన్న సోమన్న ఆలయంలో సోమవారం ఉదయం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజారులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద సీసీ రోడ్డు, తాగునీరు వసతి కోసం రూ.20 లక్షల నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. నల్లవెల్లి, మాల్‌, మంతన్‌గౌరెల్లి తదితర గ్రామాల మధ్య వెలసిన సోమన్న దేవాలయ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. స్వామివారికి పూజలు చేసి సమృద్ధిగా వర్షాలు కురవాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సత్తు వెంకటరమణారెడ్డి, ఎంపీపీ రమావత్‌ జ్యోతీనాయక్‌, జెడ్పీటీసీ కర్నాటి రమేష్‌గౌడ్‌, మంతన్‌గౌరెల్లి ఎంపీటీసీ సభ్యుడు కొర్ర అరవింద్‌ నాయక్‌, సర్పంచ్‌ కనుక నర్సయ్య, టీఆర్‌ఎస్‌ నాయకులు రమావత్‌ శ్రీనివాస్‌ నాయక్‌, శంకర్‌నాయక్‌, శ్రీనువాస్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు. పూజల అనంతరం గ్రామస్తులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.

మరిన్ని వార్తలు