ఆర్‌అండ్‌బీ చేతికి పంచాయతీ రాజ్‌ రోడ్లు

20 Aug, 2016 00:00 IST|Sakshi
శ్రీకాకుళం టౌన్‌: రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీరాజ్‌ పరిధిలో ఉన్న 738 రోడ్లను రహదారులు భవనాల శాఖకు బదలాయిస్తూ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. దీనికి సంబంధించి జీఓ నంబరు 22ను విడుదల చేసిన ప్రభుత్వం అందులో శ్రీకాకుళం జిల్లాకు చెందిన 61 రోడ్లను చేర్చింది. జిల్లాలోని 61రోడ్ల పొడవు 346.730 కిలోమీటర్లు. శ్రీకాకుళం, పలాస, ఆమదాలవలస నియోజక వర్గాల్లో అత్యధికంగా రోడ్లు ఆర్‌అండ్‌బీ పరిధిలోకి మార్చారు.
గతంలో పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలో ఉండి తారురోడ్డుగా మార్చిన వాటిని మెయింటెనెన్సు, రిపేర్లు అవసరాల దృష్టిలో ఉంచుకుని మార్పు చేసిన ట్టు జీఓలో పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచే ఈ మార్పు అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ జీఓ ఆధారంగా ఆర్‌అండ్‌బీ అధికారులు రోడ్ల మరమ్మతులకు నిధులు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. కిలో మీటరుకు ఏటా రూ.10వేలు వంతున మెయింటెనెన్స్‌ నిధులు విడుదల చేయాల్సి ఉంది. ఇంతవరకు ఆ నిధులు విడుదల కాక ఇబ్బంది పడుతున్నామని ఆర్‌అండ్‌బీ అధికారులు చెబుతున్నారు. ఈ నిధులు విడుదలైతే తప్ప మరమ్మతులు సాధ్యం కావని అంటున్నారు.  
మరిన్ని వార్తలు