సినీ ఫక్కీలో దారిదోపిడీ

6 Aug, 2016 09:48 IST|Sakshi
 • ఆయిల్‌ ట్యాంకర్‌ను అడ్డగించిన దుండగులు
 • డ్రైవర్‌ను బెదిరించి రూ.3 లక్షల అపహరణ
 • తాళ్లరేవు :
  సినీ ఫక్కీలో ఆయిల్‌ ట్యాంకర్‌ను కారుతో అడ్డుకున్న దుండగులు, డ్రైవర్‌ను బెదిరించి నగదు దోచుకున్న సంఘటన సంచలనం కలిగించింది. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నుంచి వస్తున్న పెట్రోల్‌ ట్యాంకర్‌ను దుండగులు దారికాచి, డ్రైవర్‌ను బెదిరించి రూ.3 లక్షలు దోచుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. యానాం నుంచి విశాఖపట్నం వెళుతున్న పెట్రోల్‌ ట్యాంకర్, తాళ్లరేవు మండలం మట్లపాలెం బ్రిడ్జి వద్దకు వచ్చేసరికి దుండగులు కారుతో అడ్డగించారు. కారులోంచి ముగ్గురు వ్యక్తులు కిందకు దిగారు. వారిలో ఒకరు ట్యాంకర్‌ క్యాబిన్‌లోకి వెళ్లి డ్రైవర్‌ సాకా సత్యనారాయణను బెదిరించాడు. ట్యాంకర్‌ను ఆపకుండా పోతావా అంటూ అతడిపై దాడిచేశారు. నగదు ఇవ్వకపోతే చంపేస్తానని హెచ్చరించడంతో, పెట్రోలు కొనుగోలు కోసం తీసుకెళుతున్న రూ.3 లక్షల నగదును సత్యనారాయణ వారికిచ్చేశాడు. ఈ మేరకు సత్యనారాయణ స్థానిక కోరంగి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో కొల్లు నరసింహబాబుతో పాటు మరో ఇద్దరిపై ఏఎస్సై ఆర్‌వీఎన్‌ మూర్తి కేసు నమోదు చేశారు. కాకినాడ రూరల్‌ సీఐ పవన్‌కిషోర్‌ పర్యవేక్షణలో దర్యాప్తు చేస్తున్నారు.
   
  సంఘటనపై పలు అనుమానాలు..! 
  మట్లపాలెం వద్ద జరిగిన దారి దోపిడీ కేసులో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసుతో యానాంకు చెందిన పలువురు ప్రముఖులకు ప్రమేయమున్నట్టు తెలిసింది. ఈ కేసు నుంచి మిగిలిన ఇద్దరిని కాపాడేందుకు కొందరు ప్రజాప్రతినిధుల ద్వారా యత్నిస్తున్నట్టు సమాచారం.
   
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా